- పత్తి రైతులకు అందుబాటులోకి రానున్న కొత్త హార్వెస్టింగ్ మెషిన్
- భోపాల్‌లో యంత్రాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
- కూలీల కొరతకు చెక్.. శ్రమ, సమయం, ఖర్చు ఆదా
- రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యమన్న కేంద్రం
పత్తి రైతుల ఏళ్లనాటి కష్టాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కూలీల కొరత, అధిక ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు ఉపశమనం కలిగించేలా దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కపాస్ హార్వెస్టింగ్ మెషిన్’ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం రైతులకు అంకితం చేశారు. భోపాల్‌లోని ఐకార్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (CIAE) శాస్త్రవేత్తలు ఈ యంత్రాన్ని రూపొందించారు.
ఇప్పటివరకు కూలీలతో చేతితో చేసే పత్తి తీత ప్రక్రియ ఈ యంత్రం ద్వారా పూర్తిగా ఆటోమేటిక్ అవుతుంది. దీనివల్ల కూలీల ఖర్చు, సమయం గణనీయంగా ఆదా అవుతుందని, పత్తి సాగు మరింత లాభదాయకంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా యంత్రం పనితీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ మెషిన్ త్వరలోనే రైతులకు అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు.
పత్తిలో ఉత్పాదకతను పెంచేందుకు అధిక దిగుబడినిచ్చే, రోగనిరోధక శక్తి కలిగిన కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే, ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటే విధానాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. భోపాల్‌లోని CIAE 51వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. భారత వ్యవసాయ రంగ యాంత్రీకరణలో ఇది ఒక కీలకమైన ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: