జనరల్ వార్తలు ...

వివాహానికి ముందు శారీరక సంబంధమా?: రేప్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు…

  • వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులేనన్న సుప్రీంకోర్టు
  • పెళ్లి పేరుతో మోసం చేశాడనే రేప్ కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు
  • శారీరక సంబంధాల విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని హితవు
  • వివాదాన్ని పరిష్కరించుకోవాలని కేసును మధ్యవర్తిత్వానికి సిఫార్సు

వివాహానికి ముందు ఒక అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు అపరిచితులేనని, శారీరక సంబంధాల విషయంలో యువతీయువకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో దాఖలైన ఓ కేసు విచారణ సందర్భంగా సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఓ 30 ఏళ్ల మహిళకు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను అవివాహితుడినని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఢిల్లీ, దుబాయ్‌లలో ఆమెతో పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, అతడికి అప్పటికే పెళ్లయిందని, ఆ తర్వాత మరో వివాహం కూడా చేసుకున్నాడని బాధితురాలు ఆలస్యంగా గుర్తించింది. తనను మోసం చేయడమే కాకుండా, రహస్యంగా వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. “మేం పాతకాలపు ఆలోచనలున్న వాళ్లమే కావచ్చు. కానీ, పెళ్లికి ముందు అపరిచితుల మధ్య శారీరక సంబంధం ఎందుకో అర్థం కావడం లేదు. పెళ్లి విషయంలో అంత కచ్చితంగా ఉన్నప్పుడు, వివాహం కాకముందే దుబాయ్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది?” అని బాధితురాలిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఎవరినైనా పెళ్లికి ముందు అంత త్వరగా నమ్మకూడదని సూచించారు.

గతంలో ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు నిరాకరించాయి. అయితే, సుప్రీంకోర్టు మాత్రం ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తూ.. కేసును మధ్యవర్తిత్వానికి పంపాలని నిర్ణయించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

Related posts

ముఖ్యమంత్రికే షాకిచ్చిన పెట్రోల్ బంకు! ఆగిపోయిన కాన్వాయ్‌లోని 19 కార్లు… ఎందుకంటే?

Ram Narayana

An entrepreneur shares 20 tips for traveling for free

Ram Narayana

ఇది ప్రపంచంలోనే అందమైన గ్రామాల్లో ఒకటి : ఆనంద్ మహీంద్రా

Ram Narayana