- ఒక్క గజం భూమిని ఆక్రమించినట్టు నిరూపించినా పదవి వదులుకుంటానన్న వెంకటరమణారెడ్డి
- అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపాటు
- పోలీసుల తీరును కూడా తప్పుపట్టిన వైనం
డిగ్రీ కళాశాల భూముల వ్యవహారం ఇప్పుడు కామారెడ్డి రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ భూముల అంశంలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తే, తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి బహిరంగ సవాల్ విసిరారు. ఈ వివాదంపై పూర్తి వాస్తవాలను బయటపెట్టాలని కోరుతూ ఆయన ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి, కళాశాల భూములకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకటరమణారెడ్డి… షబ్బీర్ అలీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సత్యదూరమైన విషయాలను ప్రచారం చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. డిగ్రీ కళాశాల భూముల వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇప్పటికే తాము ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశామని, ప్రభుత్వం నుంచి సమాచారం రాగానే అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని స్పష్టం చేశారు. “కాలేజీ భూముల విషయంలో నేను ఒక్క గజం భూమినైనా ఆక్రమించినట్లు లేదా అవినీతి చేసినట్లు నిరూపించినా పదవి వదులుకోవడానికి సిద్ధం” అని ఆయన సవాల్ విసిరారు.
జిల్లాలో శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతోనే తాను ఇప్పటివరకు ఓపికతో ఉన్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోలీసుల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలవడానికి వస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇదే నిబంధన కాంగ్రెస్ నాయకులకు ఎందుకు వర్తించడం లేదని ఆయన ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ భూముల వ్యవహారంలో పక్కా ఆధారాలతో నిజాలను ప్రజల ముందు ఉంచుతామని, అప్పటి వరకు అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: