- మెక్సికన్ సైన్యం ఆపరేషన్‌లో డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో హతం
- ప్రియురాలిని ట్రాక్ చేయడంతో చిక్కిన డ్రగ్ కింగ్‌పిన్
- ఆపరేషన్‌లో అమెరికా నిఘా వర్గాల కీలక సహకారం
- ఎల్ మెంకో మృతితో పలు రాష్ట్రాల్లో చెలరేగిన హింసాకాండ
- ప్రతీకార దాడుల్లో 70 మందికి పైగా మృతి
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ లార్డ్, జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అధినేత నెమెసియో ఒసెగెరా సెర్వాంటెస్ అలియాస్ ‘ఎల్ మెంచో’ హతమయ్యాడు. అతడి ప్రియురాలి కదలికలను నిశితంగా గమనించిన మెక్సికన్ సైన్యం, అమెరికా నిఘా వర్గాల సహకారంతో జలిస్కో రాష్ట్రంలోని తపల్పాలో ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది.
మెక్సికో రక్షణ శాఖ మంత్రి జనరల్ రికార్డో ట్రెవిల్లా ట్రెజో తెలిపిన వివరాల ప్రకారం అధికారులు ఎల్ మెంచో ప్రియురాలి సహచరురాలిని గుర్తించి ఆమెను అనుసరించారు. ఆమె ఫిబ్రవరి 20న ఎల్ మెంచో ప్రియురాలిని తపల్పాలోని ఒక రహస్య గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆ మహిళ మరుసటి రోజు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎల్ మెంచో అక్కడే ఉన్నాడని నిర్ధారించుకున్న ప్రత్యేక దళాలు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశాయి.
సైనిక దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగానే ఎల్ మెంచో భద్రతా సిబ్బంది భారీగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సైనిక హెలికాప్టర్ దెబ్బతినడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఎదురుకాల్పుల మధ్య ఎల్ మెంచో సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. గాయపడిన అతడిని సైన్యం అదుపులోకి తీసుకుని, చికిత్స కోసం మెక్సికో సిటీకి హెలికాప్టర్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
ఎల్ మెంచో మరణవార్త తెలియగానే అతడి కార్టెల్ సభ్యులు సుమారు 20 రాష్ట్రాల్లో ప్రతీకార దాడులకు తెగబడ్డారు. జలిస్కో, గ్వానాజువాటో వంటి రాష్ట్రాల్లో రోడ్లపై వాహనాలకు నిప్పుపెట్టి, భద్రతా దళాలపై దాడులు చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో 25 మంది నేషనల్ గార్డ్ సిబ్బందితో సహా మొత్తం 70 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన సీఐఏ కీలక నిఘా సమాచారం అందించిందని మెక్సికన్ అధికారులు ధ్రవీకరించారు. కాగా, ఎల్ మెంచోను పట్టిస్తే అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
Save or share this story as a newspaper-style Epaper Clip: