అంతర్జాతీయం

గ్రాడ్యుయేషన్‌కు ముందే ఘోరం.. టెక్సాస్‌ కాల్పుల్లో సవితా షాన్ మృతి…

  • టెక్సాస్‌లో దుండగుడి విచక్షణారహిత కాల్పులు
  • ఇరాన్ జెండా ఉన్న టీషర్ట్‌తో దాడికి పాల్పడిన ఉన్మాది
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రకోణంపై అనుమానం

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌లో జరిగిన ఈ ఘటనలో భారత సంతతికి చెందిన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరగడంతో దీని వెనుక ఉగ్రకోణం ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దాడిలో విద్యార్థినితో పాటు మరొకరు మరణించగా, 14 మంది గాయపడ్డారు.

ఆదివారం తెల్లవారుజామున ఆస్టిన్‌లోని ఓ బీర్ గార్డెన్ వెలుపల ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సెనెగల్‌కు చెందిన నియాగా డయాగ్నే (53) అనే వ్యక్తి ఇరాన్ జెండా గుర్తు ఉన్న టీషర్ట్‌తో జనంపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ముందు పిస్టల్‌తో, ఆపై రైఫిల్‌తో తూటాల వర్షం కురిపించాడు. ఈ దాడిలో భారత సంతతి విద్యార్థిని సవితా షాన్ (21) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని కాల్చి చంపారు.

ఈ ఘటనను ఎఫ్‌బీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. నిందితుడు ధరించిన టీషర్ట్‌పై “ప్రాపర్టీ ఆఫ్ అల్లా” అని రాసి ఉండటం, ఇరాన్ జెండా గుర్తు ఉండటంతో ఇది ఉగ్రవాద చర్యేనని భావిస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతీకార దాడులు జరగొచ్చని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

కాల్పుల్లో మరణించిన సవితా షాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చదువుతున్నారు. ఈ ఏడాదే ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. “ప్రపంచాన్ని మార్చాలనే తపన ఉన్న విద్యార్థినిని కోల్పోయామని” యూనివర్సిటీ ప్రెసిడెంట్ జిమ్ డేవిస్ ఆవేదన వ్యక్తం చేశారు. సవిత చదువుతో పాటు ఆస్టిన్ తమిళ సంఘంలో వాలంటీర్‌గా సేవలందిస్తూ, సొంతంగా ఈ-కామర్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ఆమె మృతితో భారతీయ కమ్యూనిటీలో విషాదం నెలకొంది.

Related posts

శ్రీలంక కీలక నిర్ణయం.. భారతీయులకు ఉచితంగా వీసాలు!

Ram Narayana

షేక్ హసీనాకు ఆశ్రయంపై బ్రిటన్ ఏం చెబుతోంది?

Ram Narayana

బూడిదగా మారిపోయిన భూతల స్వర్గం హవాయి.. కాలిపోయిన శవాలతో భయానకంగా!

Ram Narayana