తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల పొత్తులపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం చాలా సహజమని అభిప్రాయపడ్డారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన అనధికారికంగా మాట్లాడారు.
గతంలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని రాకేశ్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. “గతంలో మేం టీడీపీతో కలిసి పోటీచేశాం, ఆ తర్వాత విడిపోయాం. మళ్లీ కలిసి పోటీచేసి కేంద్రంలో, ఏపీలో అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావొచ్చు కదా?” అని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఇతర పార్టీల సహాయం తీసుకోవడంలో తప్పు లేదని రాకేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. “నడవడానికి మనకు ఒక కాలు ఇబ్బందిగా ఉన్నప్పుడు, తాత్కాలికంగా మరొకరి సాయం తీసుకుంటాం. రాజకీయాల్లో కూడా మనం నిలదొక్కుకునేందుకు మరొకరి సాయం తీసుకుంటే తప్పేముంది?” అని ఆయన అన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: