- పరకాల తమకు కంచుకోట అన్న కొండా మురళి
- తన కుమార్తె సుస్మిత తనకంటే ధైర్యవంతురాలని కితాబు
- కార్యకర్తల రక్షణే ధ్యేయంగా ఆమె పని చేస్తోందని వెల్లడి
తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో పాల్గొన్న ఆయన, పరకాల నియోజకవర్గంపై తన పట్టును చాటుకుంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పరకాల నియోజకవర్గం తమకు కంచుకోట అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ పరకాల నుంచే పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. పరకాల రాజకీయాల్లో తమ కుటుంబానిదే పైచేయి అని ధీమా వ్యక్తం చేశారు. తన కుమార్తె కొండా సుస్మిత తనకన్నా చాలా ధైర్యవంతురాలని, ఎవరినైనా ఎదిరించే సత్తా ఆమెకు ఉందని కొనియాడారు. పార్టీ కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే సుస్మిత ఊరుకోదని, వారి కోసం ఎంతటి వారినైనా ఎదుర్కొంటుందని చెప్పారు. కార్యకర్తల రక్షణే ధ్యేయంగా ఆమె పని చేస్తోందని మురళి పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: