ఓవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య పశ్చిమాసియాలో భీకర పోరు సాగుతుండగా, మరోవైపు తూర్పు ఆసియాలో ఉత్తర కొరియా అలజడి సృష్టించింది. ఉత్తర కొరియా శనివారం ఉదయం ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం, జపాన్ కోస్ట్ గార్డ్ వెల్లడించాయి. ప్రపంచ దేశాల దృష్టి పశ్చిమాసియాపై ఉన్న సమయంలో కిమ్ జోంగ్ ఉన్ ఈ చర్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా తన బలగాలను మోహరించి యుద్ధంలో తలమునకలై ఉన్న తరుణంలో, అమెరికాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఉత్తర కొరియా ఈ ప్రయోగానికి పూనుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్షిపణి ఎంత దూరం ప్రయాణించింది, అది ఏ రకమైన క్షిపణి అనే అంశాలపై దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు లోతుగా విశ్లేషిస్తున్నాయి.
ఈ ప్రయోగం నేపథ్యంలో జపాన్ తన సముద్ర తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇరాన్‌కు రష్యా మరియు చైనా పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఉత్తర కొరియా ప్రయోగం అమెరికాకు కొత్త తలనొప్పిగా మారింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: