కులమతాల హద్దులు చెరిపేస్తూ, మానవత్వమే పరమార్థమని చాటిచెప్పే అరుదైన దృశ్యం కడపలో ఆవిష్కృతమైంది. తెలుగు నూతన సంవత్సరం ‘శ్రీ పరాభవ నామ’ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, దేవుని గడప కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ముస్లిం భక్తులు పోటెత్తారు. తమ ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరుడిని అల్లుడిగా భావించి, ముస్లిం మహిళలు సమర్పించిన ‘సారె’ భక్తి పారవశ్యాన్ని చాటిచెప్పింది.
ఈ సంప్రదాయం వెనుక శతాబ్దాల నాటి ఒక పురాణ గాథ ఉంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన వేంకటేశ్వర స్వామి, ముస్లిం యువతి అయిన బీబీ నాంచారమ్మను వివాహం చేసుకున్నారని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే ముస్లింలు స్వామివారిని తమ ఇంటి ‘అల్లుడు’గా, బీబీ నాంచారమ్మను తమ ‘ఆడపడుచు’గా భావిస్తారు. ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు కొత్త బట్టలు, పిండి వంటలు, పూజా సామగ్రితో ఇంటి అల్లుడి దర్శనానికి రావడం ఇక్కడి ముస్లిం కుటుంబాలకు తరతరాలుగా వస్తున్న ఆనవాయతీ.
ముస్లిం మహిళలు సంప్రదాయబద్ధంగా ఆలయానికి విచ్చేసి, స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి, హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. “మా పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని మేము గౌరవిస్తాం. రంజాన్ మాసంలో కూడా ఉగాది పండుగను, స్వామివారి దర్శనాన్ని పవిత్రంగా భావిస్తాం” అని ముస్లి భక్తులు పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: