వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో షర్మిల, సునీత కేవలం పావులని అన్నారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదాపై వస్తున్న ఆరోపణలను సతీశ్ రెడ్డి తిప్పికొట్టారు. “వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే షర్మిలకు భారీగా ఆస్తులు రాసిచ్చారు. జూబ్లీహిల్స్ ఇల్లు, ఇడుపులపాయ భూములు, హైడ్రో ప్రాజెక్టుల్లో వాటాలు.. ఇలా కొడుకు కంటే కూతురికే వైఎస్సార్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు జగన్ తన స్వార్జితంతో సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా వాటా కావాలని అడగటం ధర్మం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో షర్మిల ఖర్చు చేసిన ప్రతి పైసా చంద్రబాబు ఇచ్చినదేనని ఆయన ఆరోపించారు.
వివేకా హత్య జరిగే సమయానికే అవినాశ్ రెడ్డికి జగన్ ఎంపీ సీటు ఖరారు చేశారని, వివేకా కూడా ఆయన గెలుపు కోసమే పనిచేశారని గుర్తు చేశారు. సీటు కోసం హత్య చేశారనడం అవివేకమని కొట్టిపారేశారు. భూమి వివాదంలో ఎర్ర గంగిరెడ్డి, వివేకా మధ్య గొడవలు ఉన్నాయని స్వయంగా దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చాడని, కానీ సునీత మాత్రం ఉద్దేశపూర్వకంగా అవినాశ్ ను ఇరికించాలని చూస్తున్నారని విమర్శించారు. “అవినాశ్ ఇప్పటికీ సునీతక్క, వివేకం పెదనాన్న అని గౌరవంగా మాట్లాడుతుంటే.. సునీత మాత్రం వివేకా పేరును, ఇమేజ్‌ను చెడగొడుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఎందుకు వదిలేశారో అందరికీ తెలుసని, ఏపీలో జగన్‌ను ఇబ్బంది పెట్టడానికే ఆమెను చంద్రబాబు ఇక్కడికి తెచ్చారని సతీశ్ రెడ్డి ఆరోపించారు. సునీత, షర్మిల, చంద్రబాబు, దస్తగిరి… వీరందరికీ కోర్టులో వాదించేది ఒక్కరే న్యాయవాది అని, దీనిని బట్టే వీరి వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో అర్థమవుతోందని స్పష్టం చేశారు.
chandrababu aditunna natakamlo pavu sharmila ….satish reddy ..
Save or share this story as a newspaper-style Epaper Clip: