మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా స్పందించారు. కుటుంబ ఆస్తుల పంపకాలపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె ఓ అడ్వొకేట్ నోటరీ విడుదల చేశారు. ఆ నోటరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో ఆమె తన కుమారుడు జగన్ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
“2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే (combined family assets). ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగ లేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిది.
ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంవోయూ రాశాడు (నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్ తో సహా ఎంవోయూలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే). ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను.
ఆస్తుల పంపకం జరగలేదు. షర్మిలకు ఇచ్చినటువంటి ఆస్తుల లాంటివే వైఎస్సార్ గారు జగన్ కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా.
దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే” అంటూ విజయమ్మ తన నోటరీలో పేర్కొన్నారు. 
Save or share this story as a newspaper-style Epaper Clip: