అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఓ ఫోన్ సంభాషణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరాన్‌తో యుద్ధం, అక్కడ అధికార మార్పిడి వంటి అంశాలపై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు ‘ఆక్సియోస్’ నివేదిక వెల్లడించింది. నెతన్యాహు అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని వాన్స్ ఆయనతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌లో పాలన మార్పు చాలా సులభమని నెతన్యాహు అతి విశ్వాసంతో చేసిన ప్రకటనలను జేడీ వాన్స్ తీవ్రంగా తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన గట్టిగా నిలదీశారు. విదేశీ యుద్ధాల్లో అనవసర జోక్యాన్ని వ్యతిరేకించే వాన్స్, ప్రస్తుతం ఇరాన్‌తో కాల్పుల విరమణ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదిలా ఉండగా, జేడీ వాన్స్‌ను బలహీనపరిచేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఓ అమెరికా అధికారి ఆరోపించడం కలకలం రేపుతోంది. ఒప్పందానికి సానుకూలంగా ఉండే వాన్స్‌తోనే చర్చలకు ఇరాన్ మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తల వెనుక ఇజ్రాయెల్ ఉందని, ఇది “జేడీ వాన్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్” అని సదరు అధికారి వ్యాఖ్యానించారు.
మాజీ మెరైన్ అయిన వాన్స్, అమెరికా మరో ‘అంతులేని యుద్ధంలో’ చిక్కుకోకూడదని మొదటి నుంచి వాదిస్తున్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూస్తానని ఆయన భరోసా ఇస్తున్నారు. 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న వాన్స్, ఇరాన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: