ఎమ్మెల్యే గా నోముల భగత్ ప్రమాణం …
-నోముల భగత్ చేత ప్రమాణస్వీకారం చేయించిన స్పీకర్ పోచారం
-సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డిపై గెలుపొందిన భగత్
-అసెంబ్లీ రూల్స్ బుక్, ఐడీ కార్డు అందించిన మంత్రి వేముల
-కార్యక్రమానికి హాజరైన పలువురు మంత్రులు
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన చేత ఎమ్మెల్యేగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. భగత్ కు అసెంబ్లీ రూల్స్ బుక్, ఐడెంటిటీ కార్డును శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల భగత్ గెలుపొందారు.
నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఆయన కుమారుడు భగత్ ను అధికార టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీకి దించింది. కాంగ్రెస్ నుంచి రాజకీయ కురువృద్ధుడు జానారెడ్డి పోటీచేశారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో జానారెడ్డి పై భగత్ 10 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఈ ఎన్నిలకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ యస్ మంత్రులు ,ఎమ్మెల్యేలు లే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాష్ట్ర నేతలంతా వచ్చి ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ అధికార టీఆర్ యస్ గెలుపును అడ్డుకోలేక పోయారు.
ఉపఎన్నికల్లో గెలుపొందిన భగత్ గురువారం శాసనసభ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు.