జాతీయ వార్తలుప్రమాదాలు ...

యూపీలో పడవ బోల్తా… 10 మంది మృతి… ప్రధాని మోదీ దిగ్భ్రాంతి…

ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బృందావన్‌లోని కేశీఘాట్ వద్ద యమునా నదిలో యాత్రికులతో వెళుతున్న పడవ బోల్తా పడటంతో 10 మంది మృతి చెందారు. మరో 14 మందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, పంజాబ్‌కు చెందిన సుమారు 30 మంది యాత్రికులు శుక్రవారం మధ్యాహ్నం పడవలో యమునా నదిలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పడవ అదుపుతప్పి నదిపై ఉన్న ఫ్లోటింగ్ పాంటూన్ వంతెన (పైపా బ్రిడ్జి)ను ఢీకొట్టింది. దీంతో పడవ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 14 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించగా, 10 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు యమునా నదిలో తీవ్రంగా గాలిస్తున్నాయి.

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

నిప్పుల కుంపటిపై ఉత్తరాది రాష్ట్రాలు… నాగపూర్ లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత

Ram Narayana

52వ సీజేగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం.. తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డు

Ram Narayana

రాజస్థాన్ మంత్రి బంగ్లాలోకి చిరుత.. జైపూర్‌లో హై అలర్ట్…

Ram Narayana