వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు విశాఖపట్నం కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల కిందటి కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు అమర్‌నాథ్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే… విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2016 ఏప్రిల్‌లో గుడివాడ అమర్‌నాథ్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు రోజుల పాటు దీక్ష కొనసాగించడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.
ఈ క్రమంలో పోలీసులు ఆయనను బలవంతంగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అప్పట్లో విశాఖ టూటౌన్ పోలీసులు అమర్‌నాథ్‌పై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
తాజాగా ఈ కేసుపై విచారణ పూర్తి చేసిన విశాఖపట్నం రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి, అమర్‌నాథ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించారు. తమ పోరాటం వల్లే విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని, కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అమర్‌నాథ్ పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: