అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేయడాన్ని వెంటనే ఆపకపోతే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘మా శత్రువులకు మీరు ఆయుధాలు ఇస్తే, మేం మిమ్మల్ని వదిలిపెట్టబోం’’ అని ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాను అడ్డుకోవాలన్న ఇరాన్ ప్రయత్నాలకు సహకరించే దేశాలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ఆయన సంకేతాలిచ్చారు.
ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించే చైనా కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బహిష్కరిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ అమలులో ఉన్న సమయంలో ఇరాన్ కు చైనా సైనిక సహకారం అందించడం తమ బలగాలకు ముప్పుగా పరిణమించనుందని అమెరికా భావిస్తోంది.
అయితే, ట్రంప్ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. తమపై నిరాధార నిందలు వేస్తున్నారని పేర్కొంది. ఈమేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ.. పశ్చిమాసియా సంక్షోభంలో పాల్గొన్న ఏ దేశానికీ తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని వివరించింది. సెన్సేషనలిజం కోసమే కొన్ని మీడియా సంస్థలు తమపై నిరాధార ఆరోపణలతో కథనాలు ప్రసారం చేస్తున్నాయని విమర్శించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: