- భర్త నిరాకరించడంతో నగలతో పుట్టింటికి పరార్
- ఏడాది తర్వాత గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం చేసి హత్యాయత్నం
- కోర్టు ఆదేశాలతో వధువు, ఆమె కుటుంబంపై కేసు నమోదు
ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన ఓ నవవధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని చూపించింది. మేలిముసుగు తీయాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని భర్తను డిమాండ్ చేసింది. అందుకు అతను నిరాకరించడంతో ఏడాది పాటు వేధించి, చివరకు అతడిని, అతని కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు యత్నించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన యువకుడికి గతేడాది ఏప్రిల్ 29న కల్పన అనే యువతితో వివాహం జరిగింది. శోభనం రోజు రాత్రి గదిలోకి వెళ్లాక, తనకు రూ.90 లక్షల నగదు ఇస్తేనే ముసుగు తీస్తానని ఆమె భర్తకు షరతు పెట్టింది. అంత పెద్ద మొత్తం ఇవ్వడం కుదరదని అతను స్పష్టం చేయడంతో, మరుసటి రోజే ఆమె పెళ్లి నగలన్నింటితో పుట్టింటికి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి ఏడాది పాటు కల్పన, ఆమె కుటుంబ సభ్యులు వరుడిని వాట్సాప్ ద్వారా బెదిరిస్తూ, ఇంటిపై దాడులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 26న కల్పన తండ్రి, సోదరుడు వరుడి ఇంటికి వచ్చి గొడవకు దిగారు. ఉద్దేశపూర్వకంగా ఇంట్లోని పీఎన్‌జీ గ్యాస్ పైప్‌లైన్‌ను ధ్వంసం చేసి, నిప్పు అంటించి కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో వరుడితో పాటు అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం జోక్యంతో, ఆగ్రా పోలీసులు తాజాగా వధువు కల్పనతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, బలవంతపు వసూళ్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: