జాతీయ వార్తలు

రైళ్ల ‘డగ డగ’ శబ్దాలకు చెక్.. ఇక ప్రయాణం సాఫీగా!

  • రైలు ప్రయాణాన్ని సుఖమయం చేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం
  • కాంక్రీట్ స్లీపర్ల స్థానంలో కొత్తగా కంపోజిట్ స్లీపర్ల వినియోగం
  • రైల్వే ట్రాక్‌ల పర్యవేక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
  • కుదుపులు, శబ్దాలు తగ్గి ప్రయాణం సాఫీగా సాగే అవకాశం
  • ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు చర్యలు

రైలు ప్రయాణంలో ఎదురయ్యే కుదుపులు, డగడగ శబ్దాలకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పడనుంది. ప్రయాణికులకు మరింత సుఖవంతమైన, భద్రమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టాల కింద కంపోజిట్ స్లీపర్లను వాడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ట్రాక్‌లను పర్యవేక్షించడం వంటి ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టనుంది. ఇటీవల ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రస్తుతం వాడుతున్న ఇనుము, కాంక్రీట్ దిమ్మెల (స్లీపర్లు) స్థానంలో తేలికైన, దృఢమైన ఫైబర్ కంపోజిట్ స్లీపర్లను ఉపయోగించనున్నారు. వీటి వల్ల రైలు వెళ్లేటప్పుడు వచ్చే కుదుపులు, శబ్దాలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా వంతెనలు, క్రాసింగ్‌ల వద్ద వీటిని అమర్చడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ స్లీపర్ల నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, మరమ్మతులు కూడా తేలిక కావడం అదనపు ప్రయోజనం.

రైల్వే భద్రతను మరింత పెంచేందుకు ఏఐ టెక్నాలజీని కూడా విస్తృతంగా వినియోగించనున్నారు. ఇన్‌స్పెక్షన్ వాహనాల్లో అమర్చిన గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్ (జీపీఆర్) సాయంతో ట్రాక్ కింద భూమి స్థితిని ఏఐ విశ్లేషిస్తుంది. దీనివల్ల ట్రాక్‌లో కంటికి కనిపించని లోపాలను కూడా ముందుగానే గుర్తించి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంది. అదేవిధంగా, రైలు ముందు భాగంలో ఏఐ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, పట్టాలపై వస్తువులున్నా లేదా ట్రాక్ దెబ్బతిన్నా ముందుగానే గుర్తించి అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోనున్నారు.

ఈ కొత్త సాంకేతికతల అమలుతో రైలు ప్రయాణంలో వైబ్రేషన్స్ తగ్గడమే కాకుండా, ట్రాక్ సమస్యలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించే అవకాశం పెరుగుతుంది. తద్వారా ప్రయాణ ఆలస్యం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

Related posts

మోదీ సభకు హాజరైతే అదనపు మార్కులంటూ యూనివర్సిటీ నోటీసు.. నిజమేంటంటే!

Ram Narayana

ఢిల్లీ పేలుడు ఘటనలో కొత్త అంశం… షూలో ట్రిగ్గర్ మెకానిజం!

Ram Narayana

56 ఏళ్లక్రితం కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం.. ఇప్పుడు లభ్యమైన 4 మృతదేహాలు!

Ram Narayana