ఐపీఎల్ క్రికెట్

ఐపీఎల్ 2026: తిలక్ వర్మ మెరుపు శతకం.. 18 ఏళ్ల రికార్డు సమం…

  • 45 బంతుల్లోనే సెంచరీ బాదిన తిలక్ వర్మ
  • 2008లో సీఎస్కేపై సనత్ జయసూర్య నెలకొల్పిన రికార్డు సమం
  • ఆ తర్వాతి స్థానంలో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్

ముంబై ఇండియన్స్ యువ సంచలనం తిలక్ వర్మ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ బాది, ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు.

ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సనత్ జయసూర్య నెలకొల్పిన 45 బంతుల సెంచరీ రికార్డును తిలక్ సమం చేశాడు. 18 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును అందుకోవడం విశేషం. ముంబై తరఫున వేగవంతమైన సెంచరీల జాబితాలో జయసూర్య, తిలక్ (45 బంతులు) అగ్రస్థానంలో ఉండగా.. కామెరూన్ గ్రీన్ (47 బంతులు), సూర్యకుమార్ యాదవ్ (49 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో తడబడింది. కగిసో రబడా ధాటికి పవర్‌ప్లేలో 46 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, నమన్ ధీర్‌ (32 బంతుల్లో 45)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

మొదట నెమ్మదిగా ఆడిన తిలక్ 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అసలైన విధ్వంసం చూపించాడు. డెత్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించి, బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. చివరి వరకు అజేయంగా నిలిచిన తిలక్, 8 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో రబాడా 3 వికెట్లు తీశాడు.

హార్దిక్ మంత్రం పనిచేసిందా?.. అప్పటివరకు నెమ్మదిగా.. ఆ తర్వాత తిలక్ ఊచకోత!

Tilak Varma Triggered By Animated Hardik Pandyas Mid Match Message Goes On To Slam MIs Fastest Ton In IPL
  • ఐపీఎల్‌లో ఫామ్‌లోకి వచ్చిన యువ బ్యాటర్ తిలక్ వర్మ
  • గుజరాత్‌పై 45 బంతుల్లోనే అజేయ శతకం
  • హార్దిక్ పాండ్యాతో మాట్లాడిన తర్వాత గేర్ మార్చిన వైనం
  • ముంబై తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం
  • ఒక దశలో 22 బంతుల్లో 19 పరుగులతో నెమ్మదిగా ఆడిన తిలక్

గత కొన్ని మ్యాచ్‌లుగా తీవ్రంగా నిరాశపరుస్తూ వచ్చిన ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ, ఎట్ట‌కేల‌కు ఫామ్‌లోకి వచ్చాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిస్తూ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో తిలక్ బ్యాటింగ్ సాగిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ ఆరంభంలో అతను చాలా నెమ్మదిగా ఆడాడు. ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సమయంలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. అయితే, 14వ ఓవర్ ముగిసిన తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా పిచ్ మధ్యలోకి వచ్చి తిలక్‌తో ఏదో సీరియస్‌గా చెప్పాడు. హార్దిక్ ఏం మంత్రం వేశాడో? గానీ ఆ తర్వాత తిలక్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

ప్రసిధ్ కృష్ణ వేసిన 15వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన దాడిని ప్రారంభించాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. బౌలర్ ఎవరైనా బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తర్వాతి 23 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు పిండుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా కవర్స్ మీదుగా, స్ట్రెయిట్‌గా కొట్టిన షాట్లు అద్భుతంగా ఉన్నాయి.

ఈ మ్యాచ్‌కు ముందు ఆందోళనకరంగా తిలక్ ఫామ్ 
ఈ మ్యాచ్‌కు ముందు తిలక్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. గత ఐదు ఇన్నింగ్స్‌లలో 20, 0, 14, 1, 8 స్కోర్లతో కలిపి కేవలం 43 పరుగులే చేశాడు. అలాంటిది ఒక్క ఇన్నింగ్స్‌తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. తిలక్‌తో కలిసి 38 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 15) మాత్రం నెమ్మదిగా ఆడాడు. తిలక్ విధ్వంసంతో చివరి 6 ఓవర్లలో ముంబై 96 పరుగులు రాబట్టింది. 

Related posts

ఎస్ఆర్‌హెచ్ సీఈఓ కావ్య మార‌న్ సంప‌ద ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

Ram Narayana

ఉప్పల్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం.. మెంటర్ యువరాజ్ ఏమ‌న్నాడంటే..!

Ram Narayana

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్ డీల్: చెన్నైకి సంజూ.. రాజస్థాన్‌కు జడేజా?

Ram Narayana