జాతీయ రాజకీయ వార్తలు

ఏపీ రాజ్యసభ రేసులో అనూహ్య పరిణామం.. అన్నామలై పేరు పరిశీలన!

  • ఏపీ కోటాలో రాజ్యసభకు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు పరిశీలన
  • రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో బీజేపీకి ఒకటి కేటాయించే అవకాశం
  • గతంలోనూ ప్రచారం జరిగినా.. ఈసారి అన్నామలైకి ఛాన్స్ ఖాయమంటున్న వర్గాలు
  • జనసేన నుంచి తొలిసారిగా పెద్దల సభకు సభ్యుడు.. రేసులో లింగమనేని రమేశ్‌
  • టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం.. రేసులో పలువురు సీనియర్లు, పారిశ్రామికవేత్తలు

ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతుండగా, బీజేపీ కోటాలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. తమిళనాడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న అన్నామలైని ఏపీ నుంచి పెద్దల సభకు పంపేందుకు బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి ఈ నాలుగు స్థానాలను దక్కించుకునే సంఖ్యాబలం ఉంది. పొత్తులో భాగంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం టీడీపీకి రెండు, జనసేన, బీజేపీలకు చెరొక స్థానం కేటాయించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు డి.మాధవ్‌ మధ్య ఈ విషయంపై చర్చలు జరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో బీజేపీకి దక్కే ఒక్క స్థానాన్ని అన్నామలైకి కేటాయించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయనకు, ఈ రూపంలో జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు కూడా ఏపీ కోటాలో అన్నామలై పేరు వినిపించింది. కానీ, అప్పుడు ఏపీకే చెందిన బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణకు అవకాశం దక్కింది. దీంతో ఈసారైనా ఆయనకు అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా తొలిసారిగా ఒకరు పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఆ పార్టీ తరఫున పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ఇక, టీడీపీకి కేటాయించే రెండు స్థానాల కోసం ఆశావహుల జాబితా పెద్దగానే ఉంది. ప్రస్తుత ఎంపీ సానా సతీశ్‌కు తిరిగి అవకాశం ఇస్తారా? లేక పార్టీలో ఆయనకు కీలక పదవిని ఇచ్చి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఆయనకు కాకపోతే మంత్రి లోకేశ్‌ సన్నిహితుడు కిలారు రాజేశ్‌ పేరు పరిశీలనలో ఉంది. వీరితో పాటు భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, సీనియర్ నేత వర్ల రామయ్య పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

మొత్తం మీద అన్నామలై పేరు తెరపైకి రావడంతో ఏపీ రాజ్యసభ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. కూటమిలోని పార్టీలు ఎవరిని ఎంపిక చేస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related posts

ఎన్సీపీ (అజిత్) లో ఏం జరుగుతోందో నాకు తెలియదు: శరద్ పవార్

Ram Narayana

త్వరలో వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్…ప్రధాని మోదీ

Ram Narayana

వారణాసిలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ …!

Ram Narayana