- ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లేదన్న కేంద్రం
- ధరల పెంపు వార్తలు అవాస్తవం, దురుద్దేశపూర్వకమని వెల్లడి
- గడిచిన నాలుగేళ్లుగా ధరలు పెంచని ఏకైక దేశం భారతేనని స్పష్టీకరణ
- అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా భారత్‌లో స్థిరంగానే రేట్లు
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న మీడియా కథనాలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వార్తలను ‘దురుద్దేశపూర్వకమైనవి, తప్పుదోవ పట్టించేవి’గా అభివర్ణిస్తూ కొట్టిపారేసింది. ధరల పెంపునకు సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదన లేదని ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేసింది.
ప్రజలలో అనవసర భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. “గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని ఏకైక దేశం భారత్. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఆ ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిరంతరం చర్యలు తీసుకున్నాయి” అని వివరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగి, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో ధరలు స్థిరంగానే ఉన్నాయని గుర్తుచేసింది.
దేశంలో సాధారణంగానే ఎల్పీజీ సిలిండర్ల సరఫరా
ఇదే సమయంలో దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరా సాధారణంగా ఉందని, ఎక్కడా కొరత లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. మరోవైపు అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు నిలిచిపోవడంతో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 103 డాలర్లు దాటగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 94 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: