- బెంగాల్ తొలి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారన్న మోదీ
- బీజేపీ ప్రభుత్వం వచ్చాక టీఎంసీ దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ బయటకు తీస్తామన్న మోదీ
- తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని ఆరోపణ
మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలకు దాక్కోవడానికి బెంగాల్‌లో ఎక్కడా చోటు దొరకదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ తొలి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారని, ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ ఓటింగ్ శాతాన్ని చూసి టీఎంసీకి భయం పట్టుకుందని అన్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్‌ను బయటకు తీస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రం విప్లవాల గడ్డ అని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలను ఎవరూ కాపాడలేరని అన్నారు. మమతా బెనర్జీ సాగిస్తున్న అటవిక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు.
మొదటి దశలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు కావడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బెంగాల్‌లో మహిళలకు గౌరవం, భద్రత, సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: