నేహా బోరా స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని ఖటిమా
ఢిల్లీ హిందూ కళాశాలలో సోషియాలజీ విద్య
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ
జేఎన్‌యూలో థియేటర్ స్టడీస్‌పై పరిశోధన
ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు
ఢిల్లీలో ఎన్నికల అక్రమాల ఆరోపణలపై జరుగుతున్న నిరసనలతో విద్యార్థి నాయకురాలు నేహా బోరా పేరు ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది. 29 ఏళ్ల నేహా బోరా అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు. ఈ వారాంతంలో ఢిల్లీలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమె కూడా నిర్బంధానికి గురయ్యారు. ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సామజిక ఉద్యమకారుడు యేగేంద్ర యాదవ్ లాంటివారితో కలిసి ఆమె 10 వ తేదీన ఢిల్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ఆమె వయసు, స్వస్థలం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో పెద్ద ఎత్తున వెతుకుతున్నారు.
ఉత్తరాఖండ్‌లోని ఖటిమాకు చెందిన నేహా బోరా విద్యాభ్యాసం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి ఢిల్లీ వరకు సాగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న హిందూ కళాశాలలో సోషియాలజీ చదివారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఢిల్లీలో పీజీ విద్యను అభ్యసించారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో థియేటర్, పెర్ఫార్మెన్స్ స్టడీస్ విభాగంలో డాక్టోరల్ పరిశోధన కూడా చేశారు. వారాంతంలో ఆమెపై గూగుల్ సెర్చ్‌లు పెరిగి సోమవారం ఉదయం గరిష్ఠ స్థాయికి చేరినట్లు సమాచారం.
నాటకరంగంతో మొదలైన ఆమె ప్రయాణం క్రమంగా విద్యార్థి రాజకీయాల వైపు మళ్లింది. 2019-2020లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి నిరసనల్లో పాల్గొన్న తర్వాత రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా మారారు. ఏఐఎస్‌ఏలో చేరి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. విద్య, విద్యార్థుల సమస్యలు, సామాజిక అసమానతలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపై ఆమె ప్రసంగాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
ఢిల్లీలో నిరసనకారులు జంతర్ మంతర్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ హాట్ వద్దకు చేరి తిరిగి అందరూ ఒక దగ్గరకు రావాలని నేహా సూచించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం సోషల్ మీడియాలో వీడియో విడుదల చేస్తూ.. “నేను నిర్బంధంలో ఉన్నాను. ఉద్యమం మాత్రం ఆగలేదు” అని ఆమె పేర్కొన్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా నిరసనల స్థితిని, తదుపరి కార్యాచరణను మద్దతుదారులకు తెలియజేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: