ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణ మంచిదే.. ఉగ్రదాడులు జరగకుండా అప్రమత్తంగా ఉన్నాం: జో బైడెన్
-ఆఫ్ఘన్‌లో సేఫ్‌జోన్‌ను మరింత విస్తరించాం
-తమ పాలనను గుర్తించాలని తాలిబన్లు కోరుతున్నారు
-తాలిబన్లు కొన్ని హామీలు కూడా ఇచ్చారు
-వారు మాటపై నిలబడతారా? అన్న అనుమానాలు ఉన్నాయి
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ నిర్ణయం తీసుకుని మంచి పనే చేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తమ చర్యను సమర్థించుకున్నారు. అయితే, ఉగ్రమూకలు దాడులకు తెగబడకుండా తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.
శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్ఘన్‌లో అమెరికా సైన్యం అధీనంలో ఉన్న విమానాశ్రయ పరిసరాలతో పాటు సేఫ్ జోన్‌ను మరింత విస్తరించామని వివరించారు. విమానాశ్రయానికి వస్తున్నవారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తమ పాలనను గుర్తించాలని తాలిబన్లు కోరుతున్నారని బైడెన్ తెలిపారు. వారి పాలనను గుర్తించే విషయంలో తాలిబన్లు కొన్ని హామీలు కూడా ఇచ్చారని చెప్పారు. అయితే, వారు మాటపై నిలబడతారా? అన్న అనుమానాలు ఉన్నాయని, తాను ఎవరినీ నమ్మబోనని తెలిపారు.
ఆఫ్ఘన్ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సురక్షిత పాలనను అందించేందుకు తాలిబన్లు కృషి చేస్తారా? అన్న విషయంపై స్పష్టతరావాల్సి ఉందని చెప్పారు. ఒకవేళ తాలిబన్లు ఇలా చేయగలిగితే ఆఫ్ఘన్‌కు ఆర్థిక, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో బయటి నుంచి సహకారం కావాల్సి ఉంటుందని తెలిపారు. తాలిబన్లు గుర్తింపు కోసం అమెరికానే కాకుండా వివిధ దేశాలను కోరుతున్నారని చెప్పారు.
ఆఫ్ఘన్ నుంచి విదేశీ రాయబార కార్యాలయాలు పూర్తిగా తరలి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారని తెలిపారు. అమెరికా బలగాలపై తాలిబన్లు ఇప్పటివరకు దాడి చేయలేదని బైడెన్ అన్నారు. తమ దేశ పౌరులను ఆఫ్ఘన్ నుంచి తరలించేందుకు నిర్దేశించిన ఆగస్టు 31 గడువును మరికొంత కాలం పొడిగించేందుకు సైనికాధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
కాబూల్ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. రంగంలోకి దిగిన అమెరికా, జర్మనీ దళాలు
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతుండడంతో ఆ దేశాన్ని వీడి విదేశాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున జనాలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ తరుచూ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు కూడా కాల్పులు జరిగాయి.
ఒక్కసారిగా ఆఫ్ఘన్ భద్రతా సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఓ భద్రతా అధికారి మృతి చెందారు. అలాగే, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అమెరికా, జర్మనీ దళాలు రంగంలోకి దిగాయి. ఆఫ్ఘన్ భద్రతా బలగాలు, దుండగులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని జర్మనీ ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.