Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వరంగల్‌లో చిట్‌ఫండ్ సంస్థ ఏజెంట్ భార్య దాష్టీకం..

వరంగల్‌లో చిట్‌ఫండ్ సంస్థ ఏజెంట్ భార్య దాష్టీకం..
-డబ్బులు అడిగినందుకు సెల్‌ఫోన్ దుకాణం యజమాని, అతడి భార్యకు నిప్పు!
-చిట్టీ పాడుకుని నాలుగు నెలలైనా ఇవ్వని డబ్బులు
-అడిగినందుకు కక్ష
-బాధితుడి సెల్‌ఫోన్ దుకాణానికి వెళ్లి పెట్రోలు పోసి నిప్పు
-తీవ్రంగా గాయపడిన బాధితుడు.. ఆసుపత్రికి తరలింపు
-మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన మరొకరికి కూడా గాయాలు

తెలంగాణలోని హన్మకొండలో ఓ చిట్‌ఫండ్ సంస్థ ఏజెంట్, అతడి భార్య దారుణానికి పాల్పడ్డారు. చిట్టీ పాడుకుని డబ్బులు అడిగిన వ్యక్తి, అతడి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. బాలసముద్రం ప్రాంతానికి చెందిన పిట్టల రాజు కుమార్‌పల్లిలో సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. హంటర్‌రోడ్డుకు చెందిన ఏజెంట్ గణేశ్ ద్వారా ఓ చిట్‌ఫండ్ సంస్థలో చిట్టీ వేశాడు. డబ్బులు అవసరం కావడంతో నాలుగు నెలల క్రితం చిట్టీ పాడాడు. చిట్టీ పాడుకుని నెలలు గడుస్తున్నా సొమ్ము ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం ఏజెంట్ గణేశ్ ఇంటికి వెళ్లిన రాజు డబ్బుల కోసం వారిని నిలదీశాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది.

గణేశ్ నిన్న తన భార్య కావ్యతో కలిసి రాజు సెల్‌ఫోన్ దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి రాజుతో వాగ్వివాదానికి దిగారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన గణేశ్ భార్య కావ్య వెంట తెచ్చుకున్న పెట్రోలు తీసి దుకాణంలో చల్లి నిప్పు పెట్టింది. అనుకోని ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన రాజు, ఆయన భార్య బయటకు పరుగులు తీశారు.

అయితే, దుకాణంలోని సెల్‌ఫోన్లు కాలి బూడిదవుతుండడంతో మళ్లీ లోపలికి వెళ్లి వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి వారిపై పెట్రోలు పోసి గణేశ్, కావ్య అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పి రాజును ఆసుపత్రికి తరలించారు. మంటలు ఆర్పేందుకు యత్నించిన పాన్ దుకాణం యజమాని రంగయ్య కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. కాగా, ఈ ఘటనలో రాజు భార్య సురక్షితంగా తప్పించుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related posts

భార్యను హత్య చేసి.. నరికి తలతో స్టేషన్‌‌లో లొంగిపోయిన భర్త.. కారణం ఇదే…!

Ram Narayana

బీఎస్పీ తమిళనాడు చీఫ్ హత్య కేసు.. ప్రధాన నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు…

Ram Narayana

జార్ఖండ్‌ అడ‌వుల్లో తుపాకుల మోత…ఒక జవాన్ మృతి …మరొకరికి సీరియస్….

Ram Narayana

Leave a Comment