కొలువు తీరిన ఆఫ్ఘన్ తాత్కాలిక తాలిబన్ కొత్త ప్రభుత్వం!
-పాకిస్తాన్ చేతిలో కీలు బొమ్మ అనే విమర్శలు
-తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని పంజ్ షేర్ ఎన్ఆర్ఎఫ్
-భావి ప్రభుత్వంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
-ఆఫ్ఘన్ దేశాధినేతగా ముల్లా హసన్ అఖుంద్,
-ఉపాధ్యక్షుడిగా బరాదర్… 30 తో మందితో మంత్రివర్గం
-దేశాధినేత సహా కీలక మంత్రిత్వశాఖల ప్రకటన
-తాలిబన్ ముఖ్యులకు తాత్కాలిక మంత్రి పదవులు
ఎట్టకేలకు ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందడుగు పడింది. రాజధాని కాబూల్ ను ఆక్రమించుకున్నాక తాలిబన్ల దృష్టి తమకు లొంగని పంజ్ షీర్ ప్రావిన్స్ పై పడింది. పంజ్ షీర్ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయంపై తమ జెండా ఎగురవేసిన అనంతరం తాలిబన్లు తమ మంత్రి వర్గాన్ని ప్రకటించారు. తాలిబన్ సుప్రీం లీడర్ ముల్లా హసన్ అఖుంద్ ఆఫ్ఘన్ దేశాధినేతగా వ్యవహరిస్తారు. అయితే తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని పంజ్ షేర్ యోధులు ప్రకటించారు.
ఉపాధ్యక్షుడు-1గా ముల్లా బరాదర్, ఉపాధ్యక్షుడు-2గా మలావీ హనాఫీ నియమితులయ్యారు. ఇక తాత్కాలిక రక్షణ మంత్రిగా ముల్లా యాకూబ్, తాత్కాలిక హోంమంత్రిగా సిరాజుద్దీన్ హక్కానీ, తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా అమీర్ ముత్తాఖీ, తాత్కాలిక ఆర్థికమంత్రిగా ముల్లా హిదాయతుల్లా బద్రీ, తాత్కాలిక విద్యాశాఖ మంత్రిగా షేక్ మలావీ నూరుల్లా వ్యవహరిస్తారు. అంతేకాదు, న్యాయశాఖ, ఐటీ శాఖ వంటి ఇతర కీలక రంగాలకు కూడా తాత్కాలిక మంత్రులను ప్రకటించారు. తాలిబన్లు తాజా మంత్రివర్గంతో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి, అధికారికంగా కార్యకలాపాలు సాగించనున్నారు.
కాగా, తాలిబన్ మంత్రుల్లో సిరాజుద్దీన్ హక్కానీతో పాటు పలువురు అమెరికా ఉగ్రవాద హిట్ లిస్టులో ఉన్నారు. తాలిబన్లు పాకిస్తాన్ చేతిలో కీలు బొమ్మలుగా మారారని విమర్శలు ఉన్నాయి.
తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని పంజ్ షేర్ ఎన్ఆర్ఎఫ్
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని పంజ్ షీర్ లోయ నుంచి పోరాటం సాగిస్తున్న జాతీయ ప్రతిఘటన కూటమి (ఎన్ఆర్ఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన ఆపద్ధర్మ క్యాబినెట్ ను చట్టవిరుద్ధమని పేర్కొంది. ఆఫ్ఘన్ ప్రజలతో తాలిబన్లకున్న వైరానికి ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఓ సంకేతమని అభివర్ణించింది. ఓటు ద్వారా ప్రజాభీష్టం మేరకు ఎన్నుకున్న ప్రభుత్వమే న్యాయ సమ్మతమని, అంతర్జాతీయ సమాజం కూడా అదే కోరుకుంటుందని వివరించింది.
తాలిబన్లు, వారి ఉగ్రవాద మిత్రులకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించాలని ఎన్ఆర్ఎఫ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ఘన్ ముఖ్య నాయకులు, విధానకర్తలతో చర్చించి భావి ప్రభుత్వంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.