- సేపియన్ ల్యాబ్స్ ‘మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్’ నివేదిక వెల్లడి
- మానసిక ఆరోగ్యంలో ప్రపంచ, దేశ సగటు కన్నా హైదరాబాద్ స్కోర్ తక్కువ
హైదారాబాద్ నగర జనాభాలో 32 శాతం మంది మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంతర్జాతీయ సంస్థ సేపియన్ ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. నగర యువత మానసిక ఆరోగ్యం ఆందోళనకర స్థాయిలో క్షీణిస్తున్నట్లు ‘మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్’ పేరుతో ఆ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సూచీల్లో హైదరాబాద్ నగరం వెనుకబడినట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా యువతరం తీవ్రమైన మానసిక ఒత్తిడి, గందరగోళాన్ని ఎదుర్కొంటున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. సేపియన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా 75 వేల మంది (18- నుండి 55 ఏళ్లు, ఆపైబడిన వారు) నుంచి వివరాలు సేకరించి మానసిక ఆరోగ్య సూచీ (Mental Health Quotient – MHQ) స్కేల్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ స్కేల్ ప్రకారం, ప్రపంచ సగటు స్కోర్ 63 కాగా, హైదరాబాద్ నగరం కేవలం 58.3 మాత్రమే. దేశంలోని మెట్రో నగరాలతో పోల్చినా హైదరాబాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ 54.4 స్కోర్‌తో హైదరాబాద్ తర్వాత స్థానంలో నిలిచింది. మానసిక ఆరోగ్యాన్ని ‘తీవ్ర ఇబ్బంది’ (Distressed) నుంచి ‘వృద్ధి చెందడం’ (Thriving) వరకు వివిధ కేటగిరీలుగా MHQ స్కేల్ విభజిస్తుంది. హైదరాబాద్ నగరం సగటున ‘ఎండ్యూరింగ్’ (Enduring), ‘మేనేజింగ్’ (Managing) కేటగిరీల మధ్య ఉందని నివేదిక తెలిపింది. “నగర జనాభాలో దాదాపు 32 శాతం మంది ‘బాధపడుతున్న’ (Struggling) లేదా ‘కష్టపడుతున్న’ (Distressed) కేటగిరీలలో ఉన్నారు. ఇది వారిలో భావోద్వేగ నియంత్రణ లోపించడం, సంబంధాలు బలహీనపడటం, మానసిక పనితీరు తగ్గడం వంటి లక్షణాలను సూచిస్తోంది” అని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేందర్ స్వామినాథన్ వివరించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: