Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భవానీపూర్ ఉపఎన్నిక: మమతా బెనర్జీపై పోటీ చేయనున్న ప్రియాంక టిబ్రేవాల్?,

భవానీపూర్ ఉపఎన్నిక: మమతా బెనర్జీపై పోటీ చేయనున్న ప్రియాంక టిబ్రేవాల్?,
-మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు లీగల్ అడ్వైజర్‌గా
-నరేంద్ర మోడీ ధూతనుంటూ ప్రియాంక టిబ్రే..
-ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతంటున్న టీఎంసీ

భవానీపూర్‌కు జరగనున్న ఉపఎన్నికలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆమెకు ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ పోటీ దాదాపు ఖరారైంది. దీంతో ఈ ఉపఎన్నిక రసవస్తరంగా మారింది. మమతకు గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రియాంకను బరిలో నిలిపినట్లు తెలుస్తోంది.

ఎవరీ ప్రియాంక టిబ్రేవాల్..?

బీజేపీలో కీలక నేతగా.. మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు లీగల్ అడ్వైజర్‌గా ఉన్న ప్రియాంక టిబ్రేవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంతో స్ఫూర్తి పొంది ఆగస్టు 2014లో బీజేపీలో చేరారు. 2015లో కోల్‌కతా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ తరపున వార్డు నెంబర్ 58(ఎంటల్లీ) నుంచి పోటీ చేసిన ఆమె.. టీఎంసీ అభ్యర్థి స్వపన్ సమ్మదర్ చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఆరేళ్లలో ప్రియాంక పశ్చిమబెంగాల్‌ బీజేపీలో కీలక పదవుల్లో పనిచేశారు. పశ్చిమబెంగాల్ భారతీయ జనతా యువజన(బీజేవైఎం) ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నుంచి పోటీ చేసిన ప్రియాంక.. టీఎంసీ అభ్యర్తి స్వర్ణ కమల్ సాహా చేతిలో 58,257 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 1981, జులై 7న కోల్‌కతాలో జన్మించారు ప్రియాంక టిబ్రేవాల్. వెల్లాండ్ గౌల్డ్ స్మిత్ స్కూల్ లో విద్యనభ్యసించిన ప్రియాంక.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. హజ్రా లా కాలేజీలో లా డిగ్రీని పూర్తి చేశారు. థాయిలాండ్ అజ్యుంప్షన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

నరేంద్ర మోడీ ధూతనుంటూ ప్రియాంక టిబ్రే..

‘నేను ప్రధాని నరేంద్ర మోడీ దూతను. బీజేపీకి ఓటేయాలని భవానీపూర్ ప్రజలను కోరుతున్నా. మోడీజీ నాయకత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ఇక్కడ కూడా బీజేపీని గెలిస్తే బెంగాల్ కూడా మరింత అభివృద్ధి సాధిస్తుంది’ అని ప్రియాంక టిబ్రేవాల్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితానికి మార్గదర్శిగా ఉన్న సుప్రియోకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసకు నేను వ్యతిరేకంగా నిలబడ్డాను. పలు కేసులు కోర్టులో ఉన్నాయి. ఎంటల్లీలో దాడులకు భయపడి వెళ్లిపోయిన బీజేపీ కార్యకర్తలను తిరిగి వచ్చేందుకు సాయం చేశాను. టీఎంసీ గూండాల దాడులకు భయపడి బీజేపీ కార్యకర్తలు తమ నివాసాలను వదిలి వెళ్లిపోయారు. ఇప్పటికైనా టీఎంసీ హింసాత్మక రాజకీయాలకు ముగింపు పలకాలి అని ప్రియాంక టిబ్రేవాల్ వ్యాఖ్యానించారు. అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని సాగిస్తామని స్పష్టం చేశారు. భవానీపూర్ ప్రజలు ఈ అరాచక టీఎంసీని ఓడించి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయలన్నారు. మమతా బెనర్జీ అధికారం కోసం ఎన్ని దారుణాలకైనా తెగబడతారని అన్నారు.

ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతంటున్న టీఎంసీ

భవానీపూర్ ఉపఎన్నికలో బీజేపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా వారు తమ సెక్యూరిటీ డిపాజిట్‌ను కోల్పోతారని టీఎంసీ డిప్యూటీ చీఫ్ విప్ తపస్ రాయ్ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ భారీ మెజార్టీతో ఈ ఉపఎన్నికలో గెలవబోతున్నారని చెప్పారు. కాగా, భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి పరిశీలకుడిగా బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నియామకమయ్యారు. ఇక, కాంగ్రెస్ పార్టీ భవానీపూర్ నుంచి పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షమైన సీపీఎం తరపున శ్రీజీబ్ బిశ్వాస్ భవానీపూర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇందుకు కారణం. ఈ ఉపఎన్నిక సెప్టెంబర్ 30న జరగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉపఎన్నికల్లో గెలిస్తేనే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాగా, ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ మరోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై నందిగ్రాం నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ ఘోర ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ టీఎంసీకీ రాష్ట్రంలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు దక్కడంతో ఆమె తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆరు నెలలోగా ఆమె ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఇప్పుడు జరుగుతున్న భవానీపూర్ ఉపఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ 213 స్తానాల్లో గెలుపొందింది. ఇది అంతకుముందు ఎన్నికల కంటే 2 స్థానాలు అథికం కావడం గమనార్హం. మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాల్లో విజయం సాధించింది. అంతకుముందు ఎన్నికల కంటే ఇది 74 స్థానాలు అదనంగా కైవసం చేసుకోవడం విశేషం. అయితే, ఇటీవల బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మళ్లీ అధికార టీఎంసీలోకి వెళ్లిపోయారు

 

 

Related posts

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ;ఉత్తమ్!

Drukpadam

బీజేపీ పాలనలో ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తం :సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు విజయ్‌ రాఘవన్‌!

Drukpadam

ప్రధాని మోడీపై ప్రియాంక గాంధీ విసుర్లు …కరోనా వేళ చోద్యం చూశారని మండిపాటు…

Drukpadam

Leave a Comment