జేసీ కుటుంబమే టీడీపీకి సమస్య …ప్రభాకర్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు
-జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం
కాలవ శ్రీనివాసులును ఉద్దేశించి జేసీ మాట్లాడడం బాధాకరం: పయ్యావుల
సీమ నీటి సమస్యలపై టీడీపీ నేతల భేటీ
హాజరైన పార్టీ నేతలు
ముందు కార్యకర్తల సంగతి చూడాలన్న జేసీ
కాలవపై పరోక్ష వ్యాఖ్యలు
భేదాభిప్రాయలకు ఇది సమయం కాదన్న పయ్యావుల
సీమ ప్రాజక్టులపై ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ కుటుంబంపై టీడీపీ నేతల భగ్గుభగ్గు మన్నారు .జేసీ కుటుంబమే టీడీపీకు పెద్ద సమస్య అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ధ్వజమెత్తారు . కాంగ్రెస్ లో వారు ఉన్నప్పుడు వారిపై నే తాము పోరాడిన విషయాన్నీ గుర్తు చేశారు. ఇప్పుడు వారు అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు బురదజల్లడం బాధాకరమని అన్నారు.
రాయలసీమ ప్రాంత నీటి సమస్యలపై టీడీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ సదస్సులో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. కాలవ శ్రీనివాసులును ఉద్దేశించి జేసీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పార్టీని బలహీన పరిచే విధంగా వ్యవహరించడం సరైన పంథా కాదని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విభేదాలు ఉంటే పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని హితవు పలికారు.
అటు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందిస్తూ… కాలవ శ్రీనివాసులు వివాదరహితుడని, ఆయనపై వ్యాఖ్యలు చేయడం అర్ధరహితమని పేర్కొన్నారు. అసలు, జేసీ కుటుంబమే టీడీపీకి సమస్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన దౌర్జన్యాలపై తాము పోరాటం చేశామని ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. జేసీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు.
రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం పేరిట నిన్న అనంతపురం కమ్మ భవనంలో టీడీపీ నేతలు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల సంగతి తర్వాత… ముందు పార్టీ కార్యకర్తల సంగతి చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమావేశానికి అందరినీ ఎందుకు పిలవలేదు… ఇదంతా చూస్తుంటే ఇద్దరు నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టుంది అని వ్యాఖ్యానించారు.
అనంతపురం పార్లమెంటు స్థానం టీడీపీ ఇన్చార్జి కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, పార్టీ నేతలు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.