బీఏసీ సమావేశానికి బీజేపీ ని ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేల ఆగ్రహం…
-ఇదేమి సంప్రదాయం అటు మండి పడ్డ రాజాసింగ్ , రఘునందన్
బీఏసీ సమావేశానికి తమను పిలవలేదని వెళ్లిపోయిన రాజా సింగ్, రఘునందన్
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన భేటీ
పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రతిపక్ష నేతలు
గతంలోనూ తమను పిలవలేదన్న బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న విషయంతో పాటు సభలో చర్చించాల్సిన అంశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమైంది. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, తదితరులు పాల్గొన్నారు.
అయితే, ఈ సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలంగాణ అసెంబ్లీ లో కొత్త సంప్రదాయాన్ని ప్రవేశ పెడుతున్నారని మండి పడ్డారు. గతంలోనూ ఇలాగే జరిగిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించకుండా బీఏసీ సమావేశం ఏర్పాటు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.