నీచులు ,పరమ నీచులు …. రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారు : టీఆర్ యస్ పై ఈటల ధ్వజం…
-ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు
-మీరు ఎంత చేసిన ప్రజలు మా వైపే
-కేసీఆర్ అహంకారానికి , హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక
-ఎన్ని అడ్డదార్లు తొక్కినా మా గెలుపును ఆపలేరు
ఎన్నికల షడ్యూల్ వెలువడిన కొన్ని గంటల్లోనే హుజురాబాద్ లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే బీజేపీ ,టీఆర్ యస్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్ యస్ పై బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . నీచులు …పరమనీచులు …రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసిన హుజురాబాద్ ప్రజలు న్యాయం ధర్మం వైపే ఉంటారని ఉద్ఘాటించారు. వారు ఎన్ని ప్రలోభాలు పెట్టిన తన గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత నీచ రాజకీయమా ? అంటూ ఈటల టీఆర్ యస్ పై విరుచుకపడ్డారు . ఎక్కడా లేని విధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో గత రెండు నెలలుగా టీఆర్ యస్ ఆడుతున్న నాటకాలను ప్రజలు అసహించుకుంటున్నారని విమర్శించారు నియోజకవర్గంలో ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నీచులు.. పరమ నీచులు నీచ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా హుజూరాబాద్ ప్రజలు ఈటలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని.. మహిళలు, యువకులు, పెద్దలు అందరూ తన వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ అహంకారానికి.. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోటీ అని ఆయన అభివర్ణించారు.
మాజీ సహచరుడు, మంత్రి హరీష్ రావుపై మరోమారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులతో బీజేపీ నేతలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. నీచ రాజకీయం చేస్తున్నారని ఈటల అన్నారు. టీఆర్‌ఎస్ నీచపు పార్టీ అని.. ఆ పార్టీ నేతలు నీచపు మనుషులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం దొంగ ఓట్లు చేర్చుతున్నారని ఆయన ఆరోపించారు.