Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వార్…

పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వార్…
-హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత…
-పోసాని వ్యాఖ్యలపై పవన్ అభిమానుల ఆగ్రహావేశాలు
-ప్రెస్ క్లబ్ లో పోసాని మీడియా సమావేశం
-తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు
-పోసానీ నిన్ను వదలం అంటూ హెచ్చరికలు
-వారిని అక్కడ్నించి తరలించిన పోలీసులు

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నటుడు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి పవన్ పై తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రెస్ క్లబ్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఖబడ్దార్ అంటూ పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి నినాదాల్లో సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.

ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని, పోసానిని వదిలేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పవన్ ను లక్ష్యంగా చేసుకుంటారా? అని మండిపడ్డారు. తాము ధర్మపోరాటం చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. అయితే, పోలీసులు వారిని బలవంతంగా బయటికి తరలించారు. ఈ క్రమంలో ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కల్యాణ్ తో జరిగిన గొడవను వివరించిన పోసాని!
-తనకు వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని వెల్లడి
-జగన్ కు అభిమానిని అని వెల్లడి
-జగన్ ను ఎవరేమన్నా అంటే భరించలేనని స్పష్టీకరణ

జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, నటుడు పోసాని కృష్ణమురళి అదేరీతిలో ధ్వజమెత్తారు. అయితే, తనకు వేల సంఖ్యలో ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్నాయంటూ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఓ కాల్ వచ్చిన విషయాన్ని కూడా అందరికీ చూపించారు. పవన్ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నందునే తాను స్పందించాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చారు.

కనీసం ఐదారు కిలోమీటర్లు కూడా నడవలేని పవన్ కల్యాణ్, పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచిన జగన్ తో పోల్చుకోవడం తనకు నచ్చలేదని పోసాని అన్నారు. తాను జగన్ అభిమానినని, ఆయనను ఎవరేమన్నా భరించలేనని పోసాని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గతంలో పవన్ కల్యాణ్ కు, తనకు మధ్య జరిగిన ఓ గొడవను పోసాని మీడియాకు వివరించారు. తాను సాధారణంగా సాయంత్రం 6 గంటలకే షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిపోతానని, కానీ ఓసారి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో రాత్రి షెడ్యూల్ పెట్టారని వెల్లడించారు. రాత్రి 9 గంటలు అవుతున్నా గానీ పవన్ రాలేదని, దాంతో తాను ఇంటికి వెళ్లిపోయానని తెలిపారు.

రాత్రి 10.30 గంటల సమయంలో భోజనం చేస్తుండగా పవన్ ఫోన్ చేసి తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. “ఇది సినిమా అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా? ఎవరికి చెప్పి ఇంటికి వెళ్లారు? మేమందరం పిచ్చోళ్లమా? అంటూ పవన్ కేకలు వేశారు. దాంతో నాక్కూడా కోపం వచ్చింది. నేను కూడా ఆర్టిస్ట్ నే… మీకోసం 9 గంటల వరకు చూశాను… రాలేదు. మీరు 10 గంటలకి వస్తే అప్పటిదాకా మేం ఎదురుచూస్తుండాలా? అంటూ నేను కూడా అదే స్థాయిలో బదులిచ్చా. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి నన్ను తీసేశారు” అంటూ వివరించారు.

ఆనాడు మీ అన్నయ్యను వాళ్లు అన్నేసి మాటలు అంటుంటే నువ్వెక్కడ ఉన్నావ్ పవన్?

“అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి సంగతి ఇది. అవినీతికి వ్యతిరేకంగా చిరంజీవి ఎలుగెత్తారు. దాంతో ఆయనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లైవ్ లో ఆయన కుమార్తె గురించి, ఆయన ఇంట్లోని ఇతర మహిళల గురించి దారుణంగా మాట్లాడారు. దాంతో చిరంజీవి ఎంతో మనోవేదనకు గురయ్యారు. కనీసం అన్నం కూడా తినకుండా, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ విషయాన్ని నాకు కురసాల కన్నబాబు చెప్పారు.

అప్పట్లో కన్నబాబు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు. కన్నబాబు నాకు ఫోన్ చేస్తే విషయం చెప్పాడు. వెంటనే, అన్నయ్యకు ఓసారి ఫోన్ ఇవ్వండి అన్నాను. అప్పుడు చిరంజీవి మాటల్లో తీవ్రమైన బాధ కనిపించింది. నా కుటుంబంలోని ఆడవాళ్లకు, రాజకీయాలకు ఏమిటి సంబంధం పోసానీ! అంటూ ఆవేదన వెలిబుచ్చారు. దాంతో నేను ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి వెళ్లి కేశినేని నానీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడాను. ఆ దెబ్బకు అట్నుంచి స్పందనే లేదు.

ఆ సమయంలో పవన్ ఏమయ్యాడు? తన అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని వాళ్లు అన్ని మాటలు అంటే పవన్ ఎక్కడున్నాడు? బయటికి వచ్చి ఎందుకు ప్రశ్నించలేదు?” అంటూ పోసాని నిలదీశారు.

నాటి సంఘటనతో చిరంజీవికి తనపై ప్రేమ పెరిగిందని పోసాని వెల్లడించారు. పోసాని నా హృదయంలో ఉన్నాడంటూ ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్టు తర్వాత తెలిసిందని వివరించారు. పవన్ తో పాటు ఆయన అభిమానులు కూడా ఉన్మాదులని పోసాని అభివర్ణించారు.

Related posts

ప్రాణం పోయేంత వరకు బీజేపీతో కలవను: నితీశ్ కుమార్

Drukpadam

బీజేపీకో హటావో …దేశ్ కి బచావో … ఖమ్మం బీఆర్ యస్ సభలో కేసీఆర్  పిలుపు …

Drukpadam

మునుగోడులో గెలుపు టీఆర్ యస్ దే అంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని..!

Drukpadam

Leave a Comment