బీజేపీ మళ్లీ సానుభూతి డ్రామాలు ఆడుతుందన్న బాల్క సుమన్.. ఆ అవసరం లేదన్న ఈటల!
-డ్రామాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వ విప్
-దుబ్బాకలో కూడా బీజేపీది ఇదే స్ట్రాటజీ అని విమర్శ
-ప్రజల మద్దతు పూర్తిగా బీజేపీకే ఉందన్న ఈటల
హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవడంతో నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం కూడా మరింత వాడివేడిగా మారింది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అధికారపార్టీ నేతలు తనపై దాడులు చేయిస్తున్నారని అబద్ధాలు చెప్తారని, ప్రతి ఇంటికీ వెళ్లి ఇవే మాటలు చెప్పి ఓట్లు పట్టే ప్రయత్నాలు చేస్తారని బాల్క సుమన్ హెచ్చరించారు.
కాబట్టి ఓటర్లు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా గతంలో ఇలాంటి నాటకాలే ఆడారని బాల్క సుమన్ ఆరోపించారు. దుబ్బాక ఎన్నిక సమయంలో కూడా బీజేపీ నేతలు ఇలాంటి డ్రామాలే ఆడారని, రఘునందన్ రావు కట్లు కట్టుకుని తిరిగారని గుర్తుచేశారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో ఈటల కూడా అలాగే సానుభూతి పొందే ప్రయత్నాలు ప్రారంభించారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
టీఆర్ఎస్ నేతల ఆరోపణలపై ఈటల తీవ్రంగా స్పందించారు. తనపై దాడి చేయించుకొని మరీ సానుభూతి పొందాల్సిన అవసరం లేదని, కొత్త కథలు అల్లి ప్రచారం చేస్తోంది టీఆర్ఎస్ పార్టీనే అని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో ప్రజల మద్దతు పూర్తిగా బీజేపీకే ఉందని స్పష్టం చేశారు.