బద్వేలు బరిలో జనసేన.. అభ్యర్థిగా నిలబడాలని మహిళా నేతకు ఫోన్!
-2014లో టీడీపీ తరఫున బద్వేలు నుంచి విజయలక్ష్మి పోటీ
-2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి
-రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానన్న విజయలక్ష్మి
ఏపీలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల బరిలో నిలవాలని జనసేన పార్టీ యోచిస్తోంది. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విజయజ్యోతిని బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు తాజాగా విజయజ్యోతికి ఫోన్ చేసి జనసేన తరఫున పోటీ చేయాలని కోరారు. దీంతో స్పందించిన విజయజ్యోతి తన మద్దతుదారులతో చర్చించి త్వరలో నిర్ణయాన్ని చెబుతానని అన్నారు. ఆమె రెండు రోజుల్లోగా నిర్ణయం తీసుకోనున్నారు. విజయలక్ష్మి గతంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు.
2014లో బద్వేలు నుంచే టీడీపీ తరఫున పోటీచేసి ఆమె ఓడిపోయారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాగా, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి అన్ని ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్న సుధను గెలిపించడానికి ఆ పార్టీ అధిష్ఠానం పలువురికి బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే బద్వేలులో వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. నిన్నటి నుంచే నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో తొలిరోజు నవతరం పార్టీ అభ్యర్థిగా రమేశ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.