లా అండ్ ఆర్డర్ మీటింగ్‌లో సీఎం కుమారుడు.. మండిపడుతున్న మాజీలు!
-సమావేశంలో కనిపించిన పంజాబ్ సీఎం చరణ్‌జీత్ కుమారుడు రిథిమ్‌జీత్
-డీజీపీతోపాటు కూర్చున్న పంజాబ్ సీఎం తనయుడు
-అతను వస్తుంటే మిగతా నేతలు ఒప్పుకోవడం దురదృష్టకరమన్న బీజేపీ
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాష్ట్రం పంజాబ్. ఇక్కడి కాంగ్రెస్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య యుద్ధం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే పార్టీ వీడిన అమరీందర్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలిసిందే.
అయితే ఇటీవల పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చరణ్‌జీత్ సింగ్ చేసిన ఒక పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర డీజీపీ వంటి అధికారులతో లా అండ్ ఆర్డర్ సమావేశం నిర్వహించారాయన. అంతవరకూ బాగానే ఉంది కానీ, ఈ సమావేశానికి తన కుమారుడు రిథిమ్‌సింగ్‌ను కూడా తీసుకెళ్లడం విమర్శలకు దారితీస్తోంది.
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీఎం కుమారుడు మీటింగ్‌కు వస్తుంటే మిగతా నేతలు ఎలా ఒప్పుకున్నారు? అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పలువురు మాజీలు కూడా ఇలాంటి సమావేశాలకు కుటుంబ సభ్యులను తీసుకురావడం నిబంధనలను ఉల్లంఘించడమే అని మండిపడుతున్నారు. ఈ వివాదంపై పంజాబ్ సీఎం ఇంకా స్పందించలేదు.