జనసేన బాటలో టీడీపీ …బద్వేల్ ఎన్నిక ఏకగ్రీవమేనా …?
-బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ సైతం దూరం… పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం
-సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి
-ఆయన భార్యకే టికెట్ ఇచ్చిన వైసీపీ
-అభ్యర్థిని నిలపడంలేదని ప్రకటించిన జనసేన
-ఏకగ్రీవం చేసుకోవాలని సూచన
-జనసేన బాటలోనే టీడీపీ
-పొలిట్ బ్యూరోలో చర్చించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఉపఎన్నిక జరగాల్సిన కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ ఈనెల 30 న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే అక్కడ వైసీపీ నుంచి గెలుపొందిన వెంకట సుబ్బయ్య మృతి చెందటంతో ఎన్నిక అనివారమైంది. వైసీపీ వెంకట సుబ్బయ్య సతీమణిని డాక్టర్ సుధను తన అభ్యర్థిగా ప్రకటించింది. జనసేన పోటీ చేయబోటంలేదని ప్రకటించిన నేపథ్యంలో , టీడీపీ కూడా బద్వేల్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థి సుధా దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బద్వేల్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుంది. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయరాదని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానించారు. చంద్రబాబు అధ్యక్షతన నేడు పార్టీ పొలిట్ బ్యూరో భేటీ అయింది. బద్వేల్ లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకే వైసీపీ టికెట్ ఇచ్చినందున, బరిలో దిగేందుకు టీడీపీ విముఖత వ్యక్తం చేసింది. తద్వారా ఏకగ్రీవానికి మార్గం సుగమం చేసింది.
ఇప్పటికే జనసేన పార్టీ బద్వేల్ లో తమ అభ్యర్థిని బరిలో దింపడంలేదని ప్రకటించడం తెలిసిందే. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్ లో పోటీ చేయడంలేదని టీడీపీ నాయకత్వం వెల్లడించింది.
బద్వేల్ లో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య కొన్నాళ్ల కిందట మరణించారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 30న పోలింగ్ ఉంటుందని ప్రకటించింది.
ఈ క్రమంలో టీడీపీ తొలుత తన అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేసింది రాజశేఖర్ గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ భావించించింది. అయితే, గత ఆనవాయితీలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ తాజాగా బరి నుంచి తప్పుకుంది.