బూతులు తిట్టడం అనేది చేతగాని వాళ్లు చేసే పని: సజ్జల!
- సీఎం జగన్ పై పట్టాభి వ్యాఖ్యలు
- విజయవాడలో వైసీపీ జనాగ్రహ దీక్ష
- పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి
- పట్టాభితో చంద్రబాబే మాట్లాడించాడని ఆరోపణ
సీఎం జగన్ ను టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అసభ్య పదజాలంతో తిట్టారంటూ వైసీపీ నేతలు విజయవాడలో జనాగ్రహ దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బూతులు మాట్లాడడం చేతగాని వాళ్లు చేసే పని అంటూ విమర్శించారు.
ఇదే తరహా మాటలతో తనను తిడితే చంద్రబాబు ఊరుకుంటారా? అని సజ్జల నిలదీశారు. పట్టాభితో చంద్రబాబే ఈ విధంగా మాట్లాడించి ఉంటాడని ఆరోపించారు. చంద్రబాబు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఇలాంటి ఘటనలే భవిష్యత్తులోనూ ఎదురవుతాయని సజ్జల హెచ్చరించారు.
సీఎంపై పట్టాభి చేసిన వ్యాఖ్యలను వారి సొంత పార్టీ వాళ్లే సమర్థించడంలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేపట్టిన దీక్షను చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
బూతులు మాట్లాడేది వాళ్లే… దొంగ దీక్షలు చేసేది వాళ్లేనంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబును చూస్తే జాలి కలుగుతోందని, ఆయన దీక్షకు కనీసం పది మంది కూడా స్పందించడంలేదని ఎద్దేవా చేశారు.