వామ్మో పెట్రోల్ @100 క్రాస్ అవుతుందా …
– జనం గగ్గోలు …పట్టించుకోని పాలకులు
-తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్న వినియోగదారులు
-మొక్కుబడి ఉద్యమాలతో సరి పెడుతున్న విపక్షాలు
-గత పాలకుల పాపాలే అంటూ చేతులెత్తిసిన ప్రధాని మోడీ
ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా భారత్ లో ఆయిల్ ధరలు పెరగటంపై జనం గగ్గోలు పెడుతున్నారు. రాజస్థాన్ లో పెరిగినట్లుగా తెలుగు రాష్ట్రాలలో సైతం @100 రూపాయలు క్రాస్ అవుతుందనే అంటున్నారు. విశ్లేషకులు . జనం గగ్గోలు పెడుతున్నారు.పాలకులు మాత్రం పట్టించుకోవటంలేదని విమర్శలు ఉన్నాయి. గతంలో ఆయిల్ రేట్లను పెంచే అధికారం కేంద్రం చేతిలో ఉండేది.ఇప్పుడు ఆయిల్ కంపెనీలకే అధికారం ఇచ్చారు. దీనితో రోజువారీ పెంపుదల పైసల్లో పెంచుతున్నట్లు చూపుతున్న అది లక్షల కోట్లకు చేరుకొంటుంది. దీని మీద వేసే పన్నులు తగ్గించుకునేందుకు రాష్ట్రము కానీ , కేంద్రంకాని సిద్దపడటంలేదు. ప్రపంచంలో అన్ని దేశాలకంటే మనదేశం అన్నిరంగాలలో దూసుకెళుతుందని మన పాలకులు గొప్పలు చెప్పుకుంటారు. వివిధ దేశాలలో పర్యటించిన మన ప్రధాని నరేంద్ర మోడీ మన దేశంలో ఉన్న అపారమైన అవకాశాలను గురించి భారత్ లో పెట్టుబడులు పెడితే మరింత భద్రతగా ఉంటుందని , ఇక్కడ సౌకర్యాలను కల్పించటం మా భాద్యత అని ప్రపంచ కుబేరులకు హామీలను ఇస్తుంటారు. కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారత్ లో పెట్రోల్ , డిజిల్ రేట్లపై మాట్లాడరు. మాట్లాడితే ఇది తమ తప్పుకాదని గత పాలకుల తప్పిదమే అంటారు. గత పాలకులు తప్పులు చేశారని మిమ్ములను అధికారంలోకి తెస్తే మానెత్తిన భారం వేస్తారా ?అంటూ సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.
మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చింది . అప్పుడు హైద్రాబాద్ లో పెట్రోల్ రేటు లీటరుకు 79 రూపాయలు ప్రస్తుతం ఉన్న రేటు 94 .97 రూపాయలు .అంతర్జాతీయ మార్కట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా , ఇక్కడ పెట్రోల్ రేట్లు మాత్రం తగ్గటం లేదు. ఎందుకు తగ్గటం లేదు అనేది సామాన్యుడికి అర్థం కానీ విషయం . ఇప్పుడు మనదేశంలోనే వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల రేట్లు ఉన్నాయి. రాజస్థాన్ లో 100 రూపాయలకు చేరుకుందని వార్తలు వచ్చాయి. అదే పంజాబ్ లో రాజస్థాన్ కన్నా ఐదు రూపాయలు తక్కువగా ఉండటంతో రాజస్థాన్ ప్రజలు పక్కనే బోర్డార్లో ఉన్న పంజాబ్ బంక్ లకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మిగతా రాష్ట్రాలలో కూడా రేటు 100 రూపాయల వైపు పరుగులు తీస్తుంది. దీనిపై ప్రజలలో ఆగ్రహం ఉన్న వివిధ పార్టీలు జరుపుతున్న మొక్కుబడి ఆందోళనలు తప్ప ప్రజల నుంచి స్పందన కరువు అవుతుంది. మాకోసం ఎవరో చేస్తారులే అనే ధోరణి కనపడుతుంది. కొన్ని చోట్లు రాజకీయ పార్టీల వాళ్ళు పెట్రోల్ రేట్లకు నిరసనగా రాస్తారోకో చేస్తుంటే వాహనాల మీద వచ్చేవారు పట్టించుకోకుండా పైగా హారన్లు కొట్టి నిరసనలు తెలిపే వారిపై కోపాన్ని ప్రదర్శించటం మనం చూస్తున్నాం . అదే జర్మనీ లో కరోనా కు ముందు పాయింట్ ఒక శాతం పెంచినందుకు రోడ్లపై వాహనాలను నిలిపి తమ నిరసనను తెలపటంతో ప్రభుత్వం దిగివచ్చింది. పెంచిన రేటును తగ్గించింది. కానీ మనం చేయలేక పోతున్నాం ప్రతిదీ రాజకీయాలకు ముడి పెట్టడంతో అసలు సమస్య పక్కదార్లు పడుతుంది.
మనకు అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ ఎంతకు దొరుకుతుంది. అంటే లీటరు కేవలం 31 .82 రూపాయలు కానీ మనకు ఇప్పుడు ఆయా ప్రాంతాలలో రేట్లు అమలు వేరువేరుగా ఉంటున్నాయి. కారణం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న చెస్ . ఎక్సైజ్ డ్యూటీ ,కేంద్రం పన్ను, రాష్ట్రాల పన్ను, ఇలా పన్నుమీద పన్నులతో తడిసి మోపడు అవుతుంది. పన్నులు వేసి ప్రజల నెత్తిన భారాలు వేయటం పై తీవ్ర విమర్శలు ఉన్నాయి.బేసిక్ గా మనకు 32 రూపాయలకు లీటరు పెట్రోల్ దొరుకుతుంటే మన పాలకులు మరో 68 రూపాయలు పెంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. మన దగ్గర రాజస్థాన్ కన్నా 5 రూపాయలు తక్కువగానే ఉంది. రేపో మాపో మన దగ్గర 100 రూపాయలు క్రాస్ కావటం ఖాయం అనే మాటలే వినిపిస్తున్నాయి
హైదరాబాద్ లో లభించే దాని ప్రకారం ఒక లీటర్ 95 రూపాయలు అనుకుంటే దానికి కేంద్రం పన్ను 32 రూపాయల 90 పైసలు రాష్ట్రము విధించే వ్యాల్యూ యాడెడ్ టాక్స్ 21 రూపాయల 29 పైసలు ఒక లీటరుకు రోడ్ టాక్స్ 5 రూపాయలు డీలర్ కమిషన్ లీటర్ కు 3 రూపాయల 68 పైసలు రవాణా ఖర్చు లీటరుకు 28 పైసలు వెరసి మొత్తం 94 రూపాయల 97 పైసలు ఇది ఫిబ్రవరి 19 న ఉన్న రేటు ప్రకారం మాత్రమే . ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2020 -21 ఆర్థిక సంవత్సరానికి 10 వేల 265 కోట్లు ఇక అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయం లక్షల కోట్లలో ఉంది. పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా రాష్ట్రాలు ఒప్పుకోవటం లేదని సాకులు చెపుతుంది కేంద్రం . రాష్ట్రాలు అడిగే దానికి కేంద్రం స్పందిస్తుందా అంటే అది లేదు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా మనదేశంలో మాత్రం తగ్గించటం లేదు. కానీ అమెరికా లాంటి దేశం రేట్లు పెద్దగా పెరిగిన సందర్భం లేదు. గత ఆరు సంవత్సరాలుగా అమెరికాలో కేవలం ఐదు సెంట్లు మాత్రమే పెట్రోల్ రేటు పెరిగింది. అంటే పెట్రోల్ ,డీజిల్ రేట్లపై పన్నుల ద్వారానే ప్రభుత్వాలు లక్షల కోట్లు వసూల్ చేస్తున్నాయి . దీనిపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్ రేట్ల పెంపుదల గత పాలకుల పాపమే నంటూ తప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని మాటలపై దేశంలో పెద్ద ఎత్తున చేర్చ జరుగుతుంది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ప్రజలపై మోయలేని బారాలు వేయకుండ ఉంటె మంచిదని అభిప్రాయాలూ వ్యక్తం వుతున్నాయి.
–