వైయస్ వివేకా హత్య కేసు.. ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు అరెస్ట్!
-శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
-హైదరాబాద్ ఆసుపత్రిలో అదుపులోకి తీసుకున్న వైనం
-అరెస్ట్ చేసినట్టు కుటుంబసభ్యులకు తెలిపిన అధికారులు
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరుకుంది. వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంతో పలువురి పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. మరోవైపు ఈరోజు మరో కీలక ఘటన చోటుచేసుకుంది. కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్ రెడ్డిని అక్కడే అదుపులోకి తీసుకోని నగరంలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి శివశంకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ కార్యాలయంలో విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్టు కుటుంబసభ్యులకు అధికారులు సమాచారం అందించారు.
దీంతో ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది. తమకు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూ వస్తున్నా వారికీ ఈ కీలక పరిణామాలు మింగుడు పడటంలేదు. కేసు ఇంకా ఎటు మలుపు తిరుగుతుందో లెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా వివేకా హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు సవాల్ విసిరారు . డబ్బు, అనుమానం, వ్యక్తిగత బలహీనతలే వివేకా హత్యకు కారణమని అన్నారు. తొలుత ఇచ్చిన వాంగ్మూలానికి, తర్వాత ఇచ్చిన దానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ముద్దాయిని సాక్షిగా మార్చాలనుకోవడం సరికాదన్నారు .
అవినాష్‌రెడ్డికి సంబంధం ఉందని నిరూపిస్తే 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా
డబ్బు, అనుమానం, వ్యక్తిగత బలహీనతలే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయన హత్య విషయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, ఉందని కనుక నిరూపిస్తే తనతో సహా జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని అన్నారు.
ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో నిన్న విలేకరులతో మాట్లాడిన రాచమల్లు.. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి తొలుత ఇచ్చిన వాంగ్మూలానికి, ఆ తర్వాత ఇచ్చిన దానికి పొంతన లేదన్నారు. సిట్, సీబీఐ దర్యాప్తులో భాగంగా ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం 161లో అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిల పేర్లు లేవని, కానీ ఆ తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం 164లో మాత్రం ఆ నలుగురి పేర్లను చేర్చారని రాచమల్లు పేర్కొన్నారు.
వివేకా హత్యలో పాల్గొన్నట్టు చెప్పిన డ్రైవర్ దస్తగిరిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అతడిని అప్రూవర్‌గా మార్చేందుకే హైకోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ముద్దాయిని సాక్షిగా మార్చాలనుకోవడం సరికాదన్నారు.
కాగా, వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి తరపున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్‌పై న్యాయవాదులు నేడు కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై కడప సబ్ కోర్టులో విచారణ ఎల్లుండి (19)కి వాయిదా పడింది.