క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

పనిమనిషిపై ఎమ్మెల్యే కొడుకు, కోడలు వేధింపులు… పరారీలో నిందితులు

  • చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు, కోడలు
  • పనిమనిషిని చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలు
  • ఆరు సెక్షన్ల కింద కేసుల నమోదు
  • ఆచూకీ లేకుండా పోయిన ఎమ్మెల్యే కొడుకు, కోడలు
  • మూడు పోలీసు బృందాలతో గాలింపు

తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆండ్రో మదివణన్, కోడలు మెర్లినా పరారీలో ఉన్నారు. పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో వారిద్దరిపై కేసు నమోదైంది. మదివణన్, మెర్లినా దంపతుల నివాసంలో ఓ యువతి పనిమనిషిగా చేరింది.

 అయితే, ఆమెను ఎమ్మెల్యే కొడుకు, కోడలు దారుణంగా వేధించేవారని, ఇంటి పనులు చేస్తున్నప్పటికీ హింసించేవారని ఆరోపణలు వచ్చాయి. మూడేళ్లు తమ వద్దే పనిచేయాలని ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకున్నారని, పని మానేసి వెళ్లిపోతే ఆమె తల్లికి హాని తలపెడతామని బెదిరించేవారని వెల్లడైంది. అప్పుడప్పుడు శరీరంపై వాతలు పెట్టి, రక్తం వచ్చేలా కొట్టేవారని పోలీసులు పేర్కొన్నారు. 

ఇటీవల ఎమ్మెల్యే కొడుకు, కోడలు తమతో పాటు ఆ యువతిని ముంబయి తీసుకెళ్లారు. అక్కడ వంట సరిగా చేయలేదని ఆమెను చితకబాదారని, బలవంతంగా పచ్చి మిరపకాయ తినిపించారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

యువతిని వేధించినట్టు ఫిర్యాదు అందిన నేపథ్యంలో, నీలాంగరై మహిళా పోలీసులు ఎమ్మెల్యే కొడుకు మదివణన్, కోడలు మెర్లినాలపై 6 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. 

ఆరు రోజుల క్రితం ఈ కేసులు నమోదు కాగా, అప్పటినుంచి మదివణన్, మెర్లినా ఆచూకీ లేకుండా పోయారు. దాంతో వారి కోసం మూడు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా, ఎమ్మెల్యే కొడుకు, కోడలు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్…

Ram Narayana

భానుడి ప్రతాపానికి అగ్నిగుండంగా మారిన దేశరాజధాని ఢిల్లీ

Ram Narayana

రాహుల్ గాంధీ, ఖర్గేకు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు…

Ram Narayana