సిద్దిపేట కలెక్టర్ రాజీనామా వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన రాజీనామా ఆమోదం చెల్లదని.. ఎమ్మెల్సీ నామినేషన్ తిరస్కరించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
తాజాగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన రాజీనామా ఆమోదంపై హైకోర్టులో సంచలన పిటిషన్ దాఖలైంది. కేంద్ర సర్వీసు అయిన ఐఏఎస్ రాజీనామాని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడమేంటని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. రీసెర్చ్ స్కాలర్ సుబేందర్ సింగ్, జె.శంకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు తెలిపారు.
మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి నామినేషన్ ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎన్నికల కమిషన్, శాసన మండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.