- ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం
- శివాలయంలో 11 నుంచి 12 మంది చనిపోయి ఉండొచ్చన్న మేడా
ఏపీలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా పలుచోట్ల ప్రాణనష్టం సంభవించింది. భవనాలు కూలిపోయాయి. పంట మొత్తం నాశనమయింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ… వర్షాల కారణంగా నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు.
పొలపత్తూరు శివాలయంలో దీపారాధనకు వెళ్లి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయంలో సరైన సమాచారం లేదని అన్నారు. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలను గుర్తించారని… పలువురు గల్లంతయ్యారని చెప్పారు. 11 నుంచి 12 మంది వరకు చనిపోయి ఉండవచ్చని తాము భావిస్తున్నామని అన్నారు.
మందపల్లి, పోలపత్తూరులో వరద కారణంగా నష్టపోయిన వారిని మేడా కన్ స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని మల్లికార్జునరెడ్డి చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ. 10 వేల చొప్పున సాయం చేస్తామని, మృతుల కుటుంబాలకు రూ. 50 వేల నుంచి లక్ష వరకు సాయాన్ని అందజేస్తామని తెలిపారు. కడప జిల్లాలో వరద బాధితులందరినీ ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చెప్పారు.