- మొరాదాబాద్ లో రోడ్డు ప్రమాదం
- బైక్ ఢీకొనడంతో శ్రీకేశ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు
- చనిపోయాడని చెప్పిన ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు
- ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీకి తరలింపు
- మరుసటి రోజు శరీరంలో కదలిక
ఉత్తరప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయాడని భావించి మార్చురీలో ఉంచితే, మరుసటి రోజు శ్వాస తీసుకోవడం నివ్వెరపరిచింది. మొరాదాబాద్ లో శ్రీకేశ్ కుమార్ (45) అనే వ్యక్తిని మోటార్ బైక్ ఢీకొట్టింది. శ్రీకేశ్ వృత్తిరీత్యా ఓ ఎలక్ట్రీషియన్. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన శ్రీకేశ్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా, అతడిని పరిశీలించిన వైద్యులు చనిపోయాడని చెప్పారు. దాంతో పోస్టుమార్టం నిమిత్తం అతడి దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీకేశ్ కుటుంబ సభ్యులు రావాల్సి ఉండడంతో అతడి దేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మరుసటి రోజు ఉదయం అటాప్సీ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు వచ్చారు. మార్చురీ తెరవగా, శ్రీకేశ్ శరీరంలో కదలిక కనిపించింది. అతడు శ్వాస తీసుకుంటున్నట్టు గుర్తించి హుటాహుటీన చికిత్సకు తరలించారు. గడ్డకట్టించే చల్లదనం కలిగించే ఫ్రీజర్ లో రాత్రంతా ఉండి, తెల్లవారిన తర్వాత ప్రాణాలతో దర్శనమిచ్చాడు. ఈ పరిణామంతో శ్రీకేశ్ కుటుంబ సభ్యుల్లో ఆనందం ఉప్పొంగింది.
ప్రస్తుతం శ్రీకేశ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని, అతడికి చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటిండెంట్ రాజేంద్ర కుమార్ ఈ అంశంపై స్పందిస్తూ, నిజంగా ఇది అద్భుతం అని అభివర్ణించారు. కాగా, అతడిని చనిపోయాడని ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు ఎలా నిర్ధారించారన్న దానిపై విచారణ జరుగుతోంది.