మరో బిల్లు తెస్తామన్న సీఎం జగన్…రాష్ట్రానికి ఎంతో నష్టమన్న చంద్రబాబు…
-కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే బిల్లును వెనక్కి తీసుకున్నారు: సోము వీర్రాజు
-తుగ్లక్ 3.0 మారాలని అనుకోవడం అత్యాశే: నారా లోకేశ్
-అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారు
-వికేంద్రీకరణ బిల్లు వాపసు తీసుకున్న ప్రభుత్వం
-సీఆర్డీయే రద్దు నిర్ణయం ఉపసంహరణ
ఏపీ ప్రభుత్వం గతంలో మూడు రాజధానుల పై చేసిన చట్టాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ , టీడీపీ లు స్పందించాయి. మూడు రాజధానులు ఎంతో నష్టమని చంద్రబాబు అన్నారు . కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే ఉద్దేశంతోనే బిల్లును ఉపసహంరించుకున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ మాట్లాడుతూ తుగ్లక్ మారతాడని అనుకోవడం అత్యాశ అవుతుందని అన్నారు.
మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లును కూడా ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. త్వరలోనే సమగ్ర వివరాలతో కూడిన కొత్త బిల్లుతో వస్తామని, మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని తెలిపారు. రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అటు, మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై రాజధాని రైతుల తరఫు న్యాయవాదులు స్పందించారు. మరోసారి బిల్లు తెస్తామని చెప్పడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. గతంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని రాజధానిని నిర్ణయించారని, రైతులను మోసం చేయడం ఇప్పటికైనా మానుకోవాలని అన్నారు.
వికేంద్రీకరణ అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే బిల్లు వెనక్కి తీసుకున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శనాస్త్రాలు సంధించారు. అధికార వికేంద్రీకరణ వారి సొత్తు కాదు అని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ బీజేపీ కూడా చేసిందని, కొత్త రాష్ట్రాలు తీసుకువచ్చిందని వివరించారు. ఒక విధానం ప్రకారం బీజేపీ వికేంద్రీకరణ చేపట్టిందని తెలిపారు. కానీ, రోడ్డుపై గోతులు పూడ్చలేని వారు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే రాజధాని అని సీఎం జగన్ గతంలో చెప్పిన మాటకు సమాధానం ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తాను చెప్పిన మాటకు జగన్ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణపై మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు. విశాఖను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. రాజధానులపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్ని పార్టీలతో చర్చించాలని, ప్రజాభిప్రాయం సేకరించాలని హితవు పలికారు.
రాజధాని వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దాని స్థానంలో మరో బిల్లును తీసుకురాబోతున్నట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మూడు రాజధానుల బిల్లులోని ప్రభుత్వ ఉద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, న్యాయపరంగా, చట్టపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లును మరింత మెరుగుపరిచేందుకు, బిల్లులో ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని పొందుపరిచేందుకే ప్రస్తుత బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.
తుగ్లక్ 3.0, మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశేనని లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని మండిపడ్డారు. ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి… మూడు రాజధానులు చేయమని ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని చెప్పడం హైలైట్ అని ఎద్దేవా చేశారు. మురుగు బుర్రలకు మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.