- భారీ బందోబస్తు మధ్య జరిగిన కొండపల్లి మునిసిపల్ చైర్మన్ ఎన్నిక
- వైస్ చైర్మన్లుగా చుట్టుకుదురు శ్రీనివాసరావు, కరిపికొండ శ్రీలక్షి
- రహస్య ఓటింగుకు వైసీపీ పట్టు
- ముసినిపల్ చట్టంలో అలాంటిదేమీ లేదన్న టీడీపీ
- కేశినేని నాని ఓటుతో టీడీపీ సొంతమైన చైర్మన్ పదవి
భారీ బందోబస్తు మధ్య జరిగిన కొండపల్లి మునిసిపల్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి మెజారిటీ రాగా, చైర్మన్‌గా ఆ పార్టీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టుబాబును పార్టీ సభ్యులు బలపరిచారు. వైస్ చైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, రెండో వైస్ చైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫలితాలను అధికారులు ప్రకటించలేదు.
ఫలితాలను వెంటనే ప్రకటించవద్దన్న హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ సీక్రెట్ ఓటింగ్ నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల అధికారిని కోరారు. టీడీపీ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. మునిసిపల్ చట్టంలో రహస్య ఓటింగ్ లేదని, చేతులెత్తి చైర్మన్‌ను ఎన్నుకోవడం మాత్రమే ఉందని, దానిని ఎలా ఉల్లంఘిస్తారంటూ టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మొదటి నుంచీ వివాదాస్పదంగా మారింది. దీంతో ఎన్నిక సజావుగా జరిపించాలంటూ టీడీపీ పిటిషన్ వేయడంతో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఉదయం 10.30 గంటలకు ఎన్నిక ప్రారంభమైంది. ఎన్నికైన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని హైకోర్టు విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. అంతేకాదు, పిటిషనర్లకు కూడా రక్షణ కల్పించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఎన్నిక అనంతరం ఫలితాలు ప్రకటించవద్దని, వివరాలు తమకు అందజేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కొండపల్లి ఎన్నిక కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఇందులో టీడీపీకి 15 మంది, వైసీపీకి 14 మంది కౌన్సిలర్ల బలం ఉంది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకున్నరు. ఎక్స్ అఫిషియో ఓట్ల అనంతరం టీడీపీ బలం 16కి పెరగడంతో ఆ పార్టీకి చైర్మన్ పదవి సొంతమైంది.