జగన్ ఒక వృద్ధుడు… అందుకే ప్రజల్లో తిరగలేడు: చంద్రబాబు
- చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- వరద బాధితులకు పరామర్శ
- జగన్ పై విమర్శలు
- ప్రజల్లోకి రాలేక వీడియో కాన్ఫరెన్స్ లు పెడుతుంటాడని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. తిరుచానూరులో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక వృద్ధుడని, ప్రజల్లో తిరగలేక వీడియో కాన్ఫరెన్స్ లు పెడుతుంటాడని ఎద్దేవా చేశారు. వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు.
తాగునీటి సంఘాలు పనిచేసి ఉంటే ఇవాళ చెరువులు తెగేవా? అని ప్రశ్నించారు. తుమ్మలగుంట భూముల కబ్జాతో తిరుపతిని వరద నీటితో ముంచారని ఆరోపించారు. తాము చెరువులను ఆధునికీకరించామని, వైసీపీ నేతల్లా ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు.
రాయల చెరువు వద్ద చంద్రబాబు కాన్వాయ్…. పైకిలేచి నమస్కరించిన చెవిరెడ్డి!
- చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- రాయల చెరువు సందర్శన
- అప్పటికే అక్కడ మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్న చెవిరెడ్డి
- విపక్ష నేత పట్ల గౌరవమర్యాదలు ప్రదర్శించిన వైనం
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రాయల చెరువు వద్ద ఇవాళ ఆసక్తికర దృశ్యం కనిపించింది. జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు రాయల చెరువును కూడా సందర్శించారు. కాగా, అప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను చెవిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇంతలో అక్కడికి చంద్రబాబు కాన్వాయ్ రావడంతో కోలాహలం నెలకొంది. అక్కడే ఇసుక బస్తాలపై విశ్రమించి ఉన్న చెవిరెడ్డి… చంద్రబాబు వాహనాన్ని చూసి గౌరవసూచకంగా పైకిలేచారు. కారులో ఉన్న టీడీపీ అధినేతకు మర్యాదపూర్వకంగా నమస్కరించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ విపక్ష నేతను గౌరవించడం పట్ల నెటిజన్లు చెవిరెడ్డిని ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.