చిత్తూరు పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘నాయకుడు అనేవాడికి.. ప్రజలకు జరగాల్సిన మంచి సరైన పద్దతిలో, అందరికి అందుతుందా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం.. అంతేతప్ప.. బాధితుల దగ్గరకు వెళ్లి డ్రామాలు చేయడం కాదు. లీడర్ అంటే అక్కడకు వెళ్లి పనులు సరైన పద్దతిలో జరుగుతున్నాయా లేదా పరిశీలించాలి. కార్యక్రమాలు సరైన పద్దతిలో జరిగేలా చూడాలి’’ అని సీఎం జగన్ తెలిపారు.
‘‘ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారులు నాకు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారు. ముఖ్యమంత్రి వస్తున్నారని.. అందుకోసం ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం అంత బిజీ అవుతారు. వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి సీఎం పర్యటన మీద ఫోకస్ పెడతారు. ఫలితంగా సహాయక చర్యలు, కార్యక్రమాలు ఆగిపోయి.. సీఎం చుట్టూ జిల్లా యంత్రాంగం, మీడియా, హడావుడి తప్ప.. పనులు జరగవు అని సీనియర్ అధికారులు నాకు తెలిపారు. వారి మాటలు వాస్తవం అనిపించాయి. అందుకే నాకు వెళ్లాలని ఉన్నా.. కూడా వెళ్లలేదు. నా పర్యటన నాలుగు రోజులు ఆలస్యం అయినా పర్వాలేదు అని ఆగాను’’ అన్నారు సీఎం జగన్.
‘‘చిత్తూరు జిల్లాలో పర్యటించడానికి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. నన్ను ఉద్దేశించి.. ‘‘గాల్లోనే వచ్చి.. గాల్లోనే కలిసి పోతారు.. ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతారు.. నన్ను వ్యతిరేకించిన వైఎస్సార్ కూడా కాలగర్భంలో కలిసిపోయారు’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో నాయకుడు అనేవాడు జనాల దగ్గరకు వెళ్లి.. వారితో మాట్లాడి.. ధైర్యం చెప్పి.. మీకు నేనున్నాను అనే నమ్మకం కలిగించాలి తప్ప. ఇలా వ్యక్తిగత విద్వేషాన్ని వెళ్లగక్కకూడదు. ఈ విషయంలో చంద్రబాబు సంస్కారానికి నా నమస్కరం’’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.