తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత!
కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖకు
ఈ తెల్లవారుజామున గుండెపోటు
ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూత
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్టణం వెళ్లిన ఆయన వేకువజామున గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు.
1978 నుంచి శ్రీవారి సేవలోనే ఉన్న శేషాద్రి 2007లోనే రిటైరయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆయనను తిరిగి ఓస్డీగా నియమించింది. ఆయన మరణం తిరుమల తిరుపతి దేవస్థానానికి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
డాలర్ శేషాద్రి హఠాన్మరణం.. స్వామి స్వరూపానంద స్పందన
- నిత్యం శ్రీవారి పాదాల చెంతనే జీవించారన్న స్వరూపానంద
- ఆయన మహా విష్ణువు హృదయంలోకి చేరుకోవాలని ఆకాంక్ష
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రితో తనకు సుదీర్ఘకాలంగా సాన్నిహిత్యం ఉందని చెప్పారు. తిరుమల వెంకన్నను దర్శించుకునే ప్రతి భక్తుడికి ఆయన సుపరిచితుడని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆదరాభిమానాలను పొందిన గొప్ప మనిషి శేషాద్రి అని చెప్పారు. శేషాద్రి నిత్యం శ్రీవారి పాదాల చెంతనే జీవించారని… ఇంతటి అదృష్టం అందరికీ దొరకదని అన్నారు. ఆయన మరణం తనను కలచి వేసిందని చెప్పారు. డాలర్ శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆత్మ శాంతించాలని… ఆయన మహా విష్ణువు హృదయంలోకి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
డాలర్ శేషాద్రి తనకు ప్రాణ సమానుడని టీటీడీ మాజీ ఈవో శ్రీనివాసరాజు అన్నారు. లక్షలాది మందికి ఆయన ప్రీతిపాత్రుడని చెప్పారు. శ్రీవారికి ఆయన చేసిన సేవలు చిరకాలం నిలిచిపోతాయని అన్నారు. 50 ఏళ్లగా స్వామివారికి ఆయన సేవలు అందించారని తెలిపారు. ఆయన మరణం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు.
డాలర్ శేషాద్రి మరణంపై చంద్రబాబు, వైవీ సుబ్బారెడ్డి ఆవేదన
- శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అన్న చంద్రబాబు
- అనునిత్యం స్వామి సేవలో తరించారని వ్యాఖ్య
- శ్రీవారికి సేవ చేయడమే ఊపిరిగా బతికారన్న వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందడం కలచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అని అన్నారు. అనునిత్యం వేంకటేశ్వరస్వామి సేవలో తరించిన వ్యక్తి శేషాద్రి అని… టీటీడీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… శేషాద్రి మరణం బాధాకరమని అన్నారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరించిన వ్యక్తి శేషాద్రి అని చెప్పారు. శ్రీవారికి సేవ చేయడమే ఊపిరిగా బతికారని అన్నారు. అర్చకులకు, అధికారులకు పెద్ద దిక్కుగా పని చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.