టీడీపీ లో జూనియర్ సెగ …కుప్పంలో జూనియర్ అభిమానుల హంగామా !
-చంద్రబాబు ఇలాకాలో జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ నేతలపై మండిపాటు
-జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు
-ధర్నాకు దిగిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు
-ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని వ్యాఖ్య
-మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరిక
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనత్తకు జరిగిన అవమానంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగ్గా లేదని టీడీపీ నేతలు వరుసగా ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో నిన్న చిత్తూరు జిల్లా కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధర్నాకు దిగడం గమనార్హం.
తమ అభిమాన నటుడు ఎన్టీఆర్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని టీడీపీ నేతలను హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన ధర్నా చర్చనీయాంశంగా మారింది.
దీంతో టీడీపీ..జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు . జూనియర్ తో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అభిమానులకు నచ్చటం లేదు . జూనియర్ ఫ్యాన్స్ సడన్ గా బయటకు వచ్చారు. ఇప్పుడు అటు సినీ…ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. 2009 ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారం చేసి..కొద్ది సభలతోనే..తన ప్రసంగాలతో తన రాజకీయ స్టామినా ఏంటో జూ ఎన్టీఆర్ నిరూపించుకున్నారు. అయితే, ఆ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో సడన్ గా జూనియర్ తన ఎన్నికల ప్రచారం ముగించాల్సి వచ్చింది.
ఆ తరువాత జరిగిన పార్టీ మహానాడు వేదికల పైనా జూనియర్ కనిపించారు. కానీ, పార్టీలో లోకేశ్ ప్రమేయం పెరిగే కొద్దీ జూనియర్ పార్టీకి దూరమయ్యారు. ఇక, తాజాగా ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాను తిరిగి సీఎం అయ్యే వరకూ సభలో కాలు పెట్టనని శపధం చేసారు. ఆ వెంటనే మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. దీని పైన పలువురు రాజకీయ నేతలు..నందమూరి కుటుంబం సీరియస్ గా స్పందించింది.
జూనియర్ స్పందన ఆలస్యం కావటంతో టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తారక్ ను తప్పు బట్టారు. విదేశాల్లో ఉన్న తారక్ ఒక వీడియో సందేశం ద్వారా తన అభిప్రాయం స్పష్టం చేసారు. అందులో చంద్రబాబు.. భువనేశ్వరి పేర్లు ప్రస్తావించలేదు. అదే సమయంలో కొడాలి నాని..వంశీల పేర్లతో పాటుగా పార్టీల పేర్లు ప్రస్తావనకు తీసుకురాలేదు. దీని పైన టీడీపీ నేతల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. వర్ల రామయ్య..బుద్దా వెంకన్న లాంటి వారు నేరుగా జూనియర్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. సింహాద్రి..ఆది లాగా వస్తారనుకుంటే ప్రవచనాలు చెప్పారంటూ కామెంట్ చేసారు.
ఇదే సమయంలో కొడాలి నాని సైతం తాము గతంలో జూనియర్ తో కలిసి ఉన్నామని..ఆయన మమ్మల్ని కంట్రోల్ చేయట ఏంటి.. తాము ఇప్పుడు జగన్ కోసం పని చేస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో జూనియర్ మాత్రం స్పందించలేదు. కానీ, ఆయనను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న పరిణామాల్లో తమ హీరోను డామేజ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక, ఆదివారం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎన్టీఆర్ అభిమానలు హల్ చల్ చేసారు. కుప్పంలోని ఓ థియేటర్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హంగామా చేసారు.
చంద్రబాబు అడ్డాలో జూనియర్ కు మద్దతుగా సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వందల మంది ఎన్టీఆర్ అభిమానులు ఓ థియేటర్లో జైలవకుశ స్పెషల్ షో వేసుకున్నారు. సినిమా ప్రదర్శన సందర్భంగా అభిమానులు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జూనియర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. కొద్ది నెలల క్రితం చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల పర్యటన సమయంలో కుప్పంలో ఇదే విధంగా జూనియర్ అభిమానులు తారక్ జెండాలను ప్రదర్శిస్తూ.. పార్టీ బాధ్యతలు అప్పగించాలని నినాదాలు చేసారు. కానీ, చంద్రబాబు నుంచి స్పందన రాలేదు. అయితే, అసలు కుప్పంలోనే ఈ స్థాయిలో జూనియర్ అభిమానులు ఆయన జెండాలు.. బ్యానర్లతో హంగామా చేయటం వెనుక ఎవరున్నారనే చర్చ మొదలైంది.
దీంతో..పాటుగా ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేయటం వెనుక వ్యూహమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..తాజాగా కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటం ఒక సమస్యగా మారితే..ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న హంగామా సైతం పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. రానున్న రోజుల్లో జూనియర సెగ టీడీపీకి తప్పేలా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.