Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సిరివెన్నెల మృతి ప‌ట్ల విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ప్రధాని

సిరివెన్నెల మృతి ప‌ట్ల విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ప్రధాని

  • సిరివెన్నెల మృతి వార్త విని ఎంతో ఆవేదన చెందానన్న వెంకయ్యనాయుడు
  • ఆయన ప్రతి పాటను అభిమానించే వారిలో తాను కూడా ఒకడినని వ్యాఖ్య
  • అత్యంత ప్రతిభావంతుడి మరణం తనను బాధించిందన్న మోదీ
Venkaiah Naidu and modi pays condolences to Sirivennela death

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా గేయ రచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రిగారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో తాను కూడా ఒకడినని చెప్పారు.

సిరివెన్నెల మృతిపై మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. ఆయన రచనలతో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుందని అన్నారు. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. ‘ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్వారా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న ఫొటోను మోదీ పోస్ట్ చేశారు.

సిరివెన్నెల మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

  • తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు
  • సినీ గీతాల్లో సాహిత్యం పాళ్లు తగ్గుతున్న తరుణంలో వచ్చారు
  • తెలుగు పాటకు ఊపిరిలూదారు
CJI NV Ramanas response on Sirivennelas death

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని ఎంతో విచారించానని ఆయన తెలిపారు. నలుగురి నోటా పది కాలాల పాటు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సిరివెన్నెల సుసంపన్నం చేశారని కొనియాడారు.

తెలుగు సినీ గీతాల్లో సాహిత్యం పాళ్లు తగ్గుతున్న తరుణంలో వచ్చిన సీతారామశాస్త్రి… పాటకు ఊపిరిలూదారని సీజేఐ ప్రశంసించారు. సాహితీ విరించి సీతారామశాస్త్రి గారికి శ్రద్ధాంజలి అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

సిరివెన్నెల మృతిపై బాలకృష్ణ, కేటీఆర్, కె.విశ్వనాథ్ స్పందన!

  • తెలుగు పాటను దశదిశలా వ్యాపింపజేసిన ఘనత సిరివెన్నెలకే దక్కుతుందన్న బాలకృష్ణ
  • కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారన్న కేటీఆర్
  • ఏం చేయాలో అర్థం కావడం లేదన్న కె.విశ్వనాథ్
Balakrishna KTR K Vishwanath response on Sirivennela death

సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ సినీ పాటకు సాహితీ గౌరవాన్ని కల్పించిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని కొనియాడారు. తెలుగు పాటను దశదిశలా వ్యాపింపజేసిన ఘనత సిరివెన్నెలకే దక్కుతుందని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ… తన పాటల ద్వారా సమాజంలో చైతన్యం నింపిన వ్యక్తి సిరివెన్నెల అని అన్నారు. కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని… సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

కె.విశ్వనాథ్ స్పందిస్తూ సిరివెన్నెల మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయినట్టు అనిపించిందని… ఇప్పుడు ఎడమ భుజాన్ని కోల్పోయానని చెప్పారు. ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే నమ్మశక్యం కావడం లేదని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ఆయన పాటకు మరణం లేదు: ఎన్టీఆర్

  • సిరివెన్నెల లేరనే మాట వినడానికే కష్టంగా ఉంది
  • అలుపెరగకుండా పాటలు రాసిన కవి ఆయన
  • ఆయన రాసిన అక్షరాలు చెరిగిపోనివి
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్న ఎన్టీఆర్  
Ntr Condolences to Sirivennela

 సిరివెన్నెల మరణం పట్ల ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

“సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్రమైన మనస్థాపానికి గురిచేసింది. అలుపెరగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం చిరస్మరణీయంగా ఉంటాయి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను” అంటూ ఆయన పట్ల తనకి గల అభిమానాన్ని .. ఆయన మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేశాడు.

 

తాజాగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. “తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన పాటల్లో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది.

ఆయన లేరనే వాస్తవం జీర్ణించుకోలేనిది. సినీపరిశ్రమకే కాదు, సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన మరణం వ్యక్తిగతంగా కూడా నాకు తీరని లోటే. నా పట్ల ఆయన ఎంతో ఆత్మీయతను కనబరిచేవారు. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయవాదం .. సామ్యవాదం వరకూ అన్ని అంశాలను గురించి తన పాటల్లో చెప్పేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని రాసుకొచ్చారు.

మోహన్ బాబు స్పందిస్తూ .. “సిరివెన్నెల సరస్వతీ పుత్రుడు .. నాకు అత్యంత సన్నిహితుడు .. విధాత తలపున ప్రభవించిన ఒక సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.

చిరంజీవి మాట్లాడుతూ, సిరివెన్నెలతో తనకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెల హాస్పిటల్ కి వెళ్లే ముందు కూడా నేను మాట్లాడాను. అవసరమైతే చెన్నైలో చూపిస్తానని చెప్పాను. మరింత మెరుగైన వైద్యం అందేలా చూస్తానని అన్నాను. ఇక్కడ వైద్యం వలన ఉపశమనం కలగకపోతే, ఇద్దరం కలిసే అక్కడికి వెళదామని ఆయన అన్నారు. అలాంటి ఆయన ఇలా జీవం లేకుండా తిరిగి వస్తారని అనుకోలేదు.

ఒకే వయసువాళ్లం కావడం వలన, మిత్రమా అంటూ నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. అలాంటి సిరివెన్నెలను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నేను కాల్ చేసినప్పుడు కూడా ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడితే, కోలుకుంటారనే అనుకున్నాను. తెలుగు సాహిత్యానికి ఒక చీకటి రోజును మిగిల్చి వెళ్లారు. ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేనిది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సిరివెన్నెల చనిపోవడానికి కారణాలు ఇవే: కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్ రావు

  • ఆరేళ్ల క్రితమే క్యాన్సర్ వల్ల సగం ఊపిరితిత్తును తీసేయాల్సి వచ్చింది
  • ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది
  • కిడ్నీ కూడా డ్యామేజ్ అయింది

సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోవడానికి గల కారణాలను కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్ రావు మీడియాకు వివరించారు. ఆరేళ్ల క్రితమే క్యాన్సర్ తో సీతారామశాస్త్రి సగం ఊపిరితిత్తును తీసేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగిందని చెప్పారు. వారం క్రితం క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం తీసేశారని అన్నారు. ఆ తర్వాత కూడా రెండు రోజులు బాగానే ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తాయని… దీంతో అడ్వాన్స్ డ్ ట్రీట్మెంట్ కోసం కిమ్స్ కు తీసుకొచ్చారని వెల్లడించారు.

కిమ్స్ లో రెండు రోజుల పాటు వైద్యాన్ని అందించిన తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు. ప్రికాస్టమీ చేశామని… 45 శాతం ఊపిరితిత్తు తీసేశామని… మిగిలిన 55 శాతం ఊపిరితిత్తుకు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. ఆయనను ఎక్మో మిషన్ పై పెట్టామని… గత ఐదు రోజుల నుంచి ఆయన ఎక్మో మిషన్ పైనే ఉన్నారని తెలిపారు. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ డ్యామేజ్ తో పాటు ఒబేసిటీ పేషెంట్ కూడా కావడంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకిందని చెప్పారు. ఈ కారణాల వల్ల ఈరోజు సాయంత్రం 4.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని తెలిపారు.

Related posts

చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడిన యువకుడు..ఎప్పటికీ వివాహం చేసుకోనని శపథం!

Drukpadam

బిగ్ బాస్ అశ్లీలతపై ఏపీ హైకోర్టులో విచారణ!

Drukpadam

భారీ వర్షాలకు అర్థరాత్రి కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్!

Drukpadam

Leave a Comment